వంగవీటి వల్ల లాభముంటుందా..?
మూడుసార్లు ఎన్నికల్లో పోటీచేస్తే గెలిచింది ఒక్కసారి మాత్రమే. అదికూడా ప్రత్యర్థి బీజేపీ అభ్యర్ధి కాబట్టే రాధా గెలిచినట్లు అర్థమవుతోంది.
వంగవీటి రాధా తొందరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు ఎల్లోమీడియా గోల గోల చేస్తోంది. ఎందుకింత గోలచేస్తోందంటే కాపు సామాజికవర్గానికి చెందిన రాధా వైసీపీలో చేరితే టీడీపీ, జనసేన నష్టపోతాయన్నట్లుగా గోలచేస్తోంది. ఎలాగంటే.. రాధా ఏ పార్టీలో ఉంటే కాపు సామాజికవర్గం ఆ పార్టీకి ఓట్లేసేస్తుందన్నట్లుగా కథనం ఇచ్చింది. అందుకనే రాధా గనుక వైసీపీలో చేరితే కాపులు అధికారపార్టీకి ఓట్లేస్తారన్నట్లుగా కలరింగ్ ఇస్తోంది. కాపుల ఓట్ల కోసం రాధాను పార్టీలో చేర్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లుగా పెద్ద కథనిమిచ్చింది.
ఈ కథనాన్ని ఎల్లోమీడియా ఎందుకు రాసిందో అర్థంకావటంలేదు. రాధా ఏపార్టీలో ఉంటే ఆ పార్టీకి కాపులు ఓట్లేస్తారన్నది అబద్ధం. ఎందుకంటే వంగవీటి రంగా కొడుకున్న గుర్తింపు తప్ప రాధాకు సొంత గుర్తింపే లేదు. 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రాధా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. తర్వాత 2009లో పీఆర్పీ తరపున సెంట్రల్లో పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో వైసీపీ తరపున పోటీచేసి సెంట్రల్ నియోజకవర్గంలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీలో చేరినా టికెట్ దక్కలేదు.
అంటే మూడుసార్లు ఎన్నికల్లో పోటీచేస్తే గెలిచింది ఒక్కసారి మాత్రమే. అదికూడా ప్రత్యర్థి బీజేపీ అభ్యర్ధి కాబట్టే రాధా గెలిచినట్లు అర్థమవుతోంది. నిజంగానే ఎల్లోమీడియా చెప్పినట్లుగా రాధాకు కాపుల్లో అంత పట్టుంటే ఏ నియోజకవర్గంలో పోటీచేసినా రాధా గెలవాలి. కాపులు బలంగా ఉన్నారని అనుకుంటున్న విజయవాడ నగరంలోనే రాధా గెలవలేకపోయారు. ఇక కాపుల్లో పట్టెక్కడుంది..? పైగా ఒక్కో ఎన్నికకు ఒక్కోపార్టీలో ఉన్నారు. ప్రతి ఎన్నికకు పార్టీ మారటం కూడా రాధాలో పెద్ద మైనస్ అనేచెప్పాలి.
అలాగే పార్టీలో ఏ పదవిచ్చినా యాక్టివ్ గా ఉండరు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం కూడా అరుదనే చెప్పాలి. రంగా కొడుకన్న బలమైన ప్లాట్ ఫారంను కూడా రాధా సరిగా ఉపయోగించుకోలేకపోయారు. కాబట్టి రాధా ఏ పార్టీలో ఉన్నా ఒకటే. ఇంతోటి నేతను కాపుల ఓట్లకోసం జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారంటే నమ్మేట్లుగా లేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీలు రాధాకు బాగా సన్నిహితులు. ఒకవేళ చేర్చుకున్నా టికెట్ ఇచ్చేది కూడా డౌటే. కాకపోతే వీళ్ళు చెప్పటం వల్లే రాధాను పార్టీలోకి చేర్చుకోవటానికి జగన్ అంగీకరించారేమో.