Telugu Global
Andhra Pradesh

కండీషన్లు అమలవుతాయా..?

జైలులో ఉన్నప్పుడే చంద్రబాబు రాజకీయ సమావేశాలు పెట్టుకున్నారు. పార్టీలోని సీనియర్ నేతలు రెగ్యులర్‌గా జైల్లో చంద్రబాబుతో భేటీ అవుతూనే ఉన్నారు.

కండీషన్లు అమలవుతాయా..?
X

స్కిల్ స్కామ్‌లో అరెస్ట‌యి రిమాండ్‌పై 50 రోజులుగా రాజ‌మండ్రి జైల్లో ఉంటున్న చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణంగా మాత్రమే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కేసులోని మెరిట్ ఆధారంగా బెయిల్ కోసం, మధ్యంతర బెయిల్ కోసం లాయర్లు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఈరోజు ఇచ్చిన మధ్యంతర బెయిల్ నవంబర్ 27వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. అదే రోజు మళ్లీ కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. కుడికంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్ప‌త్రి వైద్యులిచ్చిన‌ సర్టిఫికెట్ ఆధారంగా మాత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

అయితే ఈ సందర్భంగా కోర్టు కొన్ని కండీషన్లు పెట్టింది. ఈ కండీషన్లపైనే చర్చ మొదలైంది. ఇంతకీ ఆ కండీషన్లు ఏమిటంటే.. చంద్రబాబు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. ఫోన్లో మాట్లాడకూడదు, మీడియా సమావేశాలు పెట్టకూడదు, బహిరంగ సభల్లో పాల్గొనకూడదు, బంధువులు కూడా చంద్రబాబును కలిసేందుకు లేదని లాయర్ వెంకటేష్ శర్మ చెప్పారు. వీటిల్లో మీడియా సమావేశం పెట్టకూడదు, బహిరంగ సభల్లో పాల్గొనకూడదనే కండీషన్లు మాత్రమే అమలయ్యే అవకాశముంది. ఎందుకంటే ఈ రెండు కండీషన్లను ఉల్లంఘిస్తే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి.

మిగిలిన కండీషన్లు ఏవీ అమలయ్యే అవకాశాలు దాదాపు లేవు. జైలులో ఉన్నప్పుడే చంద్రబాబు రాజకీయ సమావేశాలు పెట్టుకున్నారు. పార్టీలోని సీనియర్ నేతలు రెగ్యులర్‌గా జైల్లో చంద్రబాబుతో భేటీ అవుతూనే ఉన్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు కలిసినప్పుడల్లా రాజకీయాలు మాట్లాడకుండా ప్రవచనాలు చెప్పుంటారా..? జైలులోనే యథేచ్చగా రాజకీయాలు చేసిన వ్యక్తి ఇక ఇంట్లో ఉన్నప్పుడు, తనను కలిసేందుకు వచ్చే నేతలతో రాజకీయాలు మాట్లాడకుండా ఎలాగుంటారు..?

ఇక ఫోన్లో మాట్లాడకూడదనే నిబంధ‌న‌ను పాటించ‌గ‌ల‌రా..? చంద్రబాబు మాట్లాడాలంటే తన ఫోన్ నుంచే మాట్లాడాలా..? వందలాది ఫోన్లు అందుబాటులో ఉండవా..? ఎవరి ఫోన్ నుండో ఎవరితోనో మాట్లాడితే ఎలా తెలుస్తుంది..? అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పరామర్శించేందుకు బంధువులు వచ్చారని చెప్పుకుంటే కోర్టు మాత్రం ఎలా స్పందిస్తుంది..? మొత్తానికి మధ్యంతర బెయిల్ మంజూరు ఓకేనే కానీ, కండీషన్లు అమల్లవటమే అనుమానం.

First Published:  31 Oct 2023 6:30 AM GMT
Next Story