నియోజకవర్గం మార్పు.. హోం మంత్రి వనితకు ప్లస్‌పాయింట్ అవుతుందా..?
రెండు నెలల కిందట నియోజకవర్గ పరిధిలో దళిత యువకుడి ఆత్మహత్య ఘటన, తదనంతర పరిణామాల్లో ఎస్సీల్లో మంత్రిపై వ్యతిరేకత పెరిగిందని అధిష్టానానికి సమాచారం అందడంతో మార్పు జరిగిందంటున్నారు.
వైసీపీ అధిష్టానం వై నాట్ 175 అన్న లక్ష్యంతో ముందుకెళుతోంది. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు జాబితాలుగా నియోజకవర్గ ఇన్‌ఛార్జులను ప్రకటించారు. తాజాగా విడుదలైన నాలుగో జాబితాలో హోం మంత్రి తానేటి వనితకు స్థానచలనం కల్పించారు. మంత్రి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నుంచి గోపాలపురం నియోజకవర్గానికి మార్చారు. అక్కడి ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కొవ్వూరు పంపారు. ఇప్పటివరకు నియోజకవర్గాలు మార్చితే నేతలు అసంతృప్తికి లోనవుతున్న ఘటనలున్నాయి. కానీ, హోం మంత్రికి మాత్రం ఇది నెత్తిన పాలు పోసినట్టేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తండ్రి రెండుసార్లు.. కుమార్తె ఒకసారి
కొవ్వూరు నియోజకవర్గంలో వనితపై ఉన్న అసంతృప్తి దృష్ట్యా ఆమెను గోపాలపురానికి మార్చారు. ముఖ్యంగా రెండు నెలల కిందట నియోజకవర్గ పరిధిలో దళిత యువకుడి ఆత్మహత్య ఘటన, తదనంతర పరిణామాల్లో ఎస్సీల్లో మంత్రిపై వ్యతిరేకత పెరిగిందని అధిష్టానానికి సమాచారం అందడంతో మార్పు జరిగిందంటున్నారు. అయితే అది మంత్రికే కలిసొస్తుంది. ఎందుకంటే.. గోపాలపురం ఆమె సొంత నియోజకవర్గం. తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు ఇక్కడి నుంచి రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వనిత కూడా ఇక్కడి నుంచి ఒకసారి సైకిల్ గుర్తుపైనే గెలిచారు. తండ్రి నాటి నుంచి నియోజకవర్గ ప్రజలతో ఆమెకు ఉన్న అనుబంధం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కలిసొస్తుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే ఆమెను సొంత నియోజకవర్గానికి పంపింది.
టీడీపీ అభ్యర్థి కూడా మారతారా..?
గోపాలపురం నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి తలారి వెంకట్రావు, టీడీపీ నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు తలపడ్డారు. 2014లో ముప్పిడి, 2019లో తలారి గెలిచారు. ఈసారి తలారిని కొవ్వూరుకు మార్చి మంత్రి తానేటి వనితను గోపాలపురం తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా అభ్యర్థిని మారుస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో వనిత కుటుంబానికి ఉన్న ఆదరణ దృష్ట్యా బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.