అదే జరిగితే నేను రాజీనామా చేస్తా - విజయసాయిరెడ్డి సవాల్
నూతన రాజధాని నుంచి హైదరాబాద్ వరకు ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ మీద మాత్రమే చర్చ జరిగిందని.. అది లాభదాయకం కాదని మాత్రమే అధికారులు చెప్పారన్నారు. అసలు రైల్వే జోన్ అంశం సాధ్యం కాదన్న చర్చే రాలేదన్నారు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదంటూ రైల్వే శాఖ ఉన్నతాధికారులు స్ఫష్టం చేశారంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రచురించిన కథనంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ కథనాలు పచ్చి అబద్దాలని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్రతోనే ప్రస్తావనకే రాని అంశాన్ని ప్రచురించారని చెప్పారు. నూతన రాజధాని నుంచి హైదరాబాద్ వరకు ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ మీద మాత్రమే చర్చ జరిగిందని.. అది లాభదాయకం కాదని మాత్రమే అధికారులు చెప్పారన్నారు. అసలు రైల్వే జోన్ అంశం సాధ్యం కాదన్న చర్చే రాలేదన్నారు.
రైల్వే జోన్ వచ్చి తీరుతుందన్నారు. రాసింది తప్పుడు కథనం అని నిరూపిస్తే రామోజీ, రాధాకృష్ణ క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. కేవలం కులం కోసం ఈ వయసులో ఇలా తప్పుడు కథనాలు రాస్తూ దిగజారిపోవద్దని రామోజీరావుకు, రాధాకృష్ణకు సలహా ఇస్తున్నట్టు విజయసాయిరెడ్డి చెప్పారు. రైల్వే జోన్ వచ్చి తీరుతుందని..ఒకవేళ రాకపోతే తానే రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ చేశారు.