Telugu Global
Andhra Pradesh

పవన్‌కు నో ఎంట్రీయేనా..?

ఎందుకంటే మోడీ పాల్గొనే కార్యక్రమాల్లో ఎవరెవరు పాల్గొనాలనేది పూర్తిగా ప్రధానమంత్రి కార్యాలయం ఇష్టంమీదే ఆధారపడుంటుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధముండదు.

పవన్‌కు నో ఎంట్రీయేనా..?
X

నరేంద్రమోడీ కార్యక్రమాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఈసారి కూడా ఎంట్రీ ఉండేట్లు లేదు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కారణంగా విశాఖలోనే మోడీ రెండు రోజులుండబోతున్నారు. బీజేపీ మిత్రపక్షం హోదాలో ప్రధానమంత్రి కార్యక్రమాల్లో తానుకూడా పాల్గొనాలని సహజంగానే పవన్ అనుకుంటారు. అయితే ఎంట్రీ దొరికేది అనుమానంగానే ఉందంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే రెండు రోజుల పర్యటన పూర్తిగా అధికారికం. కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటున్నాయి.

అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇందుకనే బీజేపీ మిత్రపక్షమే అయినా జనసేన అధినేతకు మోడీని కలిసే అవకాశాలు దాదాపు లేవని సమాచారం. అసలు మోడీ రాకసందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లలో ఇప్పటివరకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజునే ప్రభుత్వం దూరంగా పెట్టేసింది. ఈ విషయంలో కమలనాధులు ఎంత గోలచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. మోడీ రాక సందర్భంగా బీజేపీ తరపున ఎంపీలు లేదా వీర్రాజు లాంటి వాళ్ళు పాల్గొనాలంటే ముందుగా జాతీయపార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట్లాడుకుని ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా ఏర్పాట్లు చేసుకోవాలి.

ఎందుకంటే మోడీ పాల్గొనే కార్యక్రమాల్లో ఎవరెవరు పాల్గొనాలనేది పూర్తిగా ప్రధానమంత్రి కార్యాలయం ఇష్టంమీదే ఆధారపడుంటుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధముండదు. బీజేపీ నేతలకే ఇంత సమస్యలున్నపుడు ఇక పవన్‌ను ఎవరు పట్టించుకుంటారు. జరుగుతున్న ఏర్పాట్ల పరిశీలన పేరుతో వీర్రాజు, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తదితరులు విశాఖలో కాస్త హడావుడి చేస్తున్నారు.

ఈ హడావుడిలో కూడా పవన్ ఎక్కడా కనబడలేదు. అంటే పవన్ను బీజేపీ నేతలే దగ్గరకు రానీయటంలేదు. కారణం ఏమిటంటే సమస్యలపై పోరాటం పేరుతో చంద్రబాబు నాయుడుతో పవన్ చేతులు కలపటమే. పైకి తమరెండు పార్టీలే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయంటున్నారు కానీ కమలనాధుల్లో పవన్ పై నమ్మకంలేదు. అందుకనే మోడీ కార్యక్రమాల్లో పవన్ పాల్గొనటం బహుశా బీజేపీ నేతలకే ఇష్టంలేనట్లుంది. నరసాపురంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా జరిగినట్లే ఇపుడు విశాఖలో కూడా జరుగుతుందేమో అనిపిస్తోంది.

First Published:  7 Nov 2022 4:56 AM GMT
Next Story