Telugu Global
Andhra Pradesh

భువనేశ్వరి సెంటిమెంట్‌ వర్కవుటవుతుందా..?

ఏదో అవసరమైనప్పుడు తప్పదంటే నారావారిపల్లెకి వెళ్ళటం తప్ప పుట్టిపెరిగిన గ్రామంతో చంద్రబాబుకు ఏరకంగానూ సంబంధాలు లేవు.

భువనేశ్వరి సెంటిమెంట్‌ వర్కవుటవుతుందా..?
X

నారావారి కుటుంబ రాజకీయం చాలా విచిత్రంగా ఉంటోంది. భువనేశ్వరి సోమవారం నారావారిపల్లెకు చేరుకున్నారు. 25వ తేదీన ‘నిజం గెలవాలి’ అనే కార్యక్రమానికి భువనేశ్వరి నారావారిపల్లె నుంచి శ్రీకారం చుట్ట‌నున్నారు. చంద్రబాబు అరెస్టుతో మృతిచెందిన వారి కుటుంబాలను ఓదార్చే కార్యక్రమానికి టీడీపీ `నిజం గెలవాలి` అని పేరు పెట్టింది. 24వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని 25వ తేదీనుంచి చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లెతో బస్సుయాత్రను ప్రారంభించబోతున్నారు. శ్రీకాళహస్తి, సత్యవేడు మీదుగా నెల్లూరు జిల్లాలోకి భువనేశ్వరి ప్రవేశించనున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. చంద్రగిరి నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడే వదిలిపెట్టేశారు. 1983 ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గాన్ని వదిలేసి కుప్పం నియోజకవర్గానికి మారిపోయారు. అప్పటినుంచి చంద్రగిరి నియోజకవర్గాన్ని పట్టించుకున్నదే లేదు. ఏదో అవసరమైనప్పుడు తప్పదంటే నారావారిపల్లెకి వెళ్ళటం తప్ప పుట్టిపెరిగిన గ్రామంతో చంద్రబాబుకు ఏరకంగానూ సంబంధాలు లేవు. ఈ కారణంగానే టీడీపీని నారావారిపల్లె కూడా పట్టించుకోవటంలేదు.

ఈ మధ్యనే జరిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీనే గెలిచింది. అంటే చంద్రబాబే వదిలేసిన సొంత నియోజకవర్గం, గ్రామాన్ని భువనేశ్వరి పట్టుకున్నారు. తన యాత్రను నారావారిపల్లె నుంచి ప్రారంభించాలని భువనేశ్వరి ఎందుకు నిర్ణయించారో ఎవరికీ అర్థంకావటంలేదు. గ్రామంలోని పెద్దల సమాధులను సందర్శించిన తర్వాత గ్రామ దేవతలైన దొడ్డిగంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. చంద్రబాబుకే నియోజకవర్గంలో పట్టులేదు. నారావారిపల్లెలో కూడా వైసీపీనే గెలిచింది. గడిచిన ఐదు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచిందే లేదు. భువనేశ్వరి ప్రారంభించబోతున్న నిజం గెలవాలి అనే బస్సుయాత్రపైన మంత్రులు, వైసీపీ నేతలతో పాటు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు.

భువనేశ్వరి కోరుకుంటున్నట్లుగా `నిజం గెలవాలి` అంటే చంద్రబాబు జైలులోనే ఉండాలని సెటైర్లు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు అరెస్టు నుంచి ఈరోజు వరకు జనాల్లో ఎక్కడా సానుభూతి కనబడలేదు. పార్టీలోని నేతల్లో కూడా చాలామంది రాబోయే ఫిబ్రవరి వరకు చంద్రబాబుకు బెయిల్ దొరకదని మానసికంగా సిద్ధమైపోయారు. చంద్రబాబు అరెస్టుతో పార్టీ నేతలు, క్యాడర్లోనే సింపతి లేనప్పుడు ఇక మామూలు జనాలు ఎందుకు స్పందిస్తారు..? ఈ నేపథ్యంలో భువనేశ్వరి సెంటిమెంటు వర్కవుటవుతుందా..? అన్నదే అసలైన పాయింట్.

First Published:  24 Oct 2023 10:10 AM IST
Next Story