Telugu Global
Andhra Pradesh

అలజడితోనే కాపులకు రాజ్యాధికారం వస్తుందా ?

జనసేన, పవన్ కళ్యాణ్ అంటే చాలా మంది కాపులకు ప్రాతినిథ్యం వహించే రెండు ఐకానిక్ సింబల్స్ కాబట్టి ఈ దిశగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసి కాపు సేనాని పవన్ ని సీఎం చేస్తే తాము ఏ పార్టీకైనా సరే మద్దతిస్తామని తేల్చి చెబుతున్నారు.అయితే ఒక కులం ఓట్ల ఆధారంగా ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారా?

అలజడితోనే కాపులకు రాజ్యాధికారం వస్తుందా ?
X

ఏపీలో కాపుల బలం బాగా ఎక్కువ.తమ బలాన్ని ఉపయోగించి రాజును చేసే బంట్లుగా కాకుండా ఏకంగా తామే రాజు కావాలనుకుంటున్నారు.అంటే రాజ్యాధికారం కాంక్షిస్తున్నారు. పాలక వర్గాలైన రెడ్డి, కమ్మల కంటే తమ కులం శాతం ఎక్కువుంది కాబట్టి ఎలాగైనా సరే ఈసారి అధికార పీఠం ఎక్కాలనుకుంటున్నారు.

జనసేన, పవన్ కళ్యాణ్ అంటే చాలా మంది కాపులకు ప్రాతినిథ్యం వహించే రెండు ఐకానిక్ సింబల్స్ కాబట్టి ఈ దిశగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసి కాపు సేనాని పవన్ ని సీఎం చేస్తే తాము ఏ పార్టీకైనా సరే మద్దతిస్తామని తేల్చి చెబుతున్నారు.అయితే ఒక కులం ఓట్ల ఆధారంగా ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారా?

కాపులను అధికారం నుంచి దూరం చేస్తున్న అంశాలపై లోతుగా అధ్యయనం చేయవలసి ఉన్నది. కాపుల స్వరూప- స్వభావాలు రాజ్యాధికారానికి ఆమడ దూరంలో ఎలా ఉంచుతున్నాయో పరిశీలించాలి.

కాపులకు 'ఐకానిక్' లీడర్లుగా ఉన్న చిరంజీవి, పవన్ కళ్యాణ్ పదే పదే 'బ్యాలెట్' ముందు బొక్కబోర్లా పడుతున్నారు.వంగవీటి రంగా వర్ధంతిని పురస్కరించుకొని విశాఖలో జరగనున్న కాపు నాడు ద్వారా ఎలాంటి తీర్మానం చేయనున్నారన్న అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్నది.తాము కాపు అభిమానంతో ''పవన్ కి ఓటేసినా ఏం జరుగుతుంది? ఆయనింకో పెళ్లి చేసుకుని, వారాహి వంటి అధునాతన వాహనాల్లో ఊరేగడం తప్ప..'' అని గోదావరి జిల్లాల్లో సగటు మహిళలు మాట్లాడుకుంటున్నారు.తన కొడుకుకు అమ్మ ఒడి ద్వారా సగం ఫీజు డబ్బులు వస్తున్నాయనీ. తనకు కూడా ఒంటరి మహిళలకిచ్చే ఫించన్లు రావడంతో పాటు.. పదే పదే వాలంటీర్లు వచ్చి.. ఈ ఆసరా ఉందీ.. ఆ చేయూత ఉందీ అంటూ.. చెబుతుంటే చూడముచ్చటగా ఉందని ఒక మహిళ చెప్పినట్టు ఒక మీడియాలో వచ్చింది.

కాపులు, రంగా సెంటిమెంటు, టీడీపీ కుట్ర వంటి అంశాల చుట్టూ తాజా రాజకీయం నడుస్తోంది. రంగాను హతమార్చిన టీడీపీతో పవన్ చేతులు కలపడం అసలు సిసలు 'కాపరి'తనమేనా? అని కొందరు నిలదీస్తున్నారు.రంగా హత్యకు కారకులైన వారెవరో తమకు స్పష్టంగా తెలియదని,ఆనాడు ప్రచారంలో ఉన్న కథనాలను అనుసరించి తామిలాంటి నిర్ణయానికి వచ్చామనీ రంగా హత్యకు కారకులెవరో తమకు కూడా స్పష్టంగా తెలియదని కొందరు కాపు నాయకులు చెప్పడం ఒక మలుపు.ఇందులో టీడీపీకి, చంద్రబాబుకూ కావలసినంత ఊరట లభించిన మాట వాస్తవం.

గతంలో ముద్రగడ చేసిన కాపు ఉద్యమం,అది ఉధృత రూపం దాల్చి తుని సమీపంలో రైలు బోగీలను తగలబెట్టడం వంటి ఘటనలు టీడీపీని బాగానే దెబ్బ తీశాయి.రైలు దగ్దం కేసులో నమోదైన కేసులను అధికారంలోకి వచ్చిన జగన్ ఎత్తివేశారు.తర్వాత కాపులను ఒక 'కాపు కాస్తూ' రావడం స్పష్టంగా కనిపిస్తోంది.కాపు నేస్తం వంటి పథకాలతో పాటు, కాపులకు మంత్రి పదవులు ఇచ్చారు. వారికంటూ ఎన్నో సామాజిక,ఆర్ధిక,రాజకీయ ప్రాధాన్యతలను ఇస్తూ ఉన్నారు.వారికి కావలసిన రిజర్వేషన్ తన పరిధిలో లేనిది కనుక తన ఆవేదనను అర్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారు.

పాలకపక్షాలుగా ముద్రపడ్డ కమ్మ,రెడ్డి సామాజిక వర్గాలను ఓవర్ టేక్ చేసి తెలంగాణలో వెలమలకు రాజకీయ అధికారం ఎలా వచ్చిందో పరిశోధన చేయాలి.అప్పుడే ఏపీలో కొత్త అధికార కులంగా కాపులు వెలుగులోకి రావడం ఎలా? అన్న తర్జన భర్జనలకు ఒక ముగింపు లభించవచ్చు.వెలమలు అంటే వారిది క్షత్రియుల్లో సబ్ క్యాస్ట్.ప్రతి కులానికీ ఒక క్షుణ్ణమైన సామాజిక స్వరూప స్వభావాలుంటాయి..వారు సమాజం నుంచి తీసుకునే ఇన్ పుట్స్- అవుట్ పుట్స్ ఇందులో అత్యంత ప్రధానాంశం.నిజానికి వెలమలు దాదాపు క్షత్రియులే కనుక ఎవరిని ఎక్కడ కొట్టాలి, ఎక్కడ పెట్టాలి అనే అంశంపై స్పష్టమైన అవగాహన ఉన్నది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలిని చూస్తే మనకు అర్ధమవుతుంది.బ్రాహ్మణుల్లో ఎంత కింది స్థాయి వారికైనా ఎలా మొక్కాలి,ఇతర కులాల వారు రాష్ట్రపతులైనా ఎలా చూడాలి అన్నది ఆయనకున్నంత స్పష్టత ఇంకెవరికీ ఉండదు..

కేసీఆర్ ఒక క్షత్రియుడిలాగానే తెలంగాణ అనే రాజ్యాన్ని సముపార్జించి,ఎనిమిదేళ్ల తర్వాత 'భారత రాష్ట్ర సమితి' అనే ఒకానొక ఆయుధాన్ని సిద్ధం చేసి భారతదేశ దండయాత్రకు బయలు దేరడం ఒక రాచరికపు లక్షణం.ఇక యజ్ఞ యాగాదులు బంబాట్మెంట్, సంక్షేమ పథకాలు ఇతరత్రా ఎన్నెన్నో కేసీఆర్ లోని రాచలక్షణాలను సుస్పష్టం చేస్తున్నాయి. ఏపీలో అధికారంలోకి రావాలని చూస్తున్న కాపుల స్వరూప స్వభావాలలో క్షత్రియ లక్షణాలు శూన్యం.

కాపులను దక్షిణ కోస్తా జిల్లాల్లో 'బలిజ'లని అంటారు.బలిజ అన్న పదం వణిజ అంటే వాణిజ్యకారుల వర్గం నుంచి వచ్చిందని అంటారు.వాణిజ్యం చేసేవారెప్పుడూ విపరీతమైన ఖర్చు, దుబారా, దయా దాక్షిణ్యాలు, దాన గుణాలు, లేని పోని ఖర్చుతో కూడుకున్న విన్యాసాలు వీరిలో ఉండవనే చెప్పాలి.వాళ్లు పైసా పైసా కూడబెట్టి సంపాదించే సొమ్ము ఎంతో విలువైనదిగా భావిస్తారు.చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ వంటి వారు కూడా ఇక్కడే తమ 'కాపరితనం' ప్రదర్శిస్తుంటారు.ఈ మధ్య కాలంలో వాళ్లూ వీళ్లూ అంటున్నారని.. చిరంజీవి కొంత మేర చారిటీకి ఖర్చు చేస్తున్నారు కానీ,ప్రాథమికంగా ఆయన చాలా చాలా పొదుపు.ఆయన అంత కష్టపడి సంపాదించినది.అంతే కష్టంగా ఖర్చు చేస్తారు.ఎవరికీ అభ్యంతరం లేదు.కానీ ఇదంతా రాజకీయాలకు పూర్తిగా భిన్నం. సంపూర్ణ వ్యతిరేకం.రాజకీయాలకు పొసగని శైలి.తాము వాణిజ్య కుటుంబీకులం కనుక ఇన్ కమింగ్ ఎక్కువగా ఉండాలి తప్ప ఔట్ గోయింగ్ అంతగా ఉండకూడదని తమకు తెలియకుండానే తాము ఫాలో అయ్యే ఒకానొక వణిజ విధానం.

తమకు తాము ఎంత కష్ట పడి సంపాదించుకుంటామో ఇతరులు కూడా అంతే కష్టపడి సంపాదించుకుని పైకి రావాలి కానీ అయాచిత లబ్ది అన్నదేమిటన్న భావన కాపుల్లో బాగా ఎక్కువ.ఇదే ఆయన ప్రజారాజ్యం విషయంలో బెడిసి కొట్టింది.తన పార్టీ సీట్లు సినిమా బాక్సుల్లా అమ్ముకున్నారన్న విమర్శలున్నాయ్.ఇవే తన కొంప ముంచాయని నేరుగా ఆయనే తన ఓటమి తర్వాత చెప్పుకున్న కారణం.

ఇదంతా అలా ఉంచితే చిరంజీవి 'ప్రజారాజ్యం' శకం ముగిసింది. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఉండకపోతే,ఓర్పుగా రాజకీయాలు నడిపితే ఏపీ రాజకీయాల ముఖచిత్రం వేరేలా ఉండేది.ఇప్పటికీ సాంకేతికంగా చిరంజీవి కాంగ్రెస్ నాయకుడు.

ఇక పవన్ కళ్యాణ్ ఆలోచన.. ఆవేశం ఇవన్నీ ఎలా ఉంటాయంటే,తమ కుటుంబం రాజకీయంగా తిన్న ఎదురు దెబ్బలకు ఏనాడైనా సరే ఒక జవాబు చెప్పాలని సుదీర్ఘ రాజకీయ లక్ష్యం పెట్టుకుని రంగంలోకి దిగినట్టుగా ఉన్నది.ఇక్కడే ఆయన ప్రయోజనాలు సగం దెబ్బతిన్నాయి.మొన్నటికి మొన్న సినీ ఇండస్ట్రీలో తన మనిషిగా చెప్పుకున్న ప్రకాష్ రాజ్ ను గెలిపించుకోవడంలో 'మెగా 'కుటుంబం ఎంత ఘోరమైన పరాభవాన్ని పొందారో అందరికీ తెలిసిందే.రాజకీయంగా అగ్రస్థానానికి వెళ్లాలంటే కమర్షియల్ మైండ్ సెట్ పూర్తిగా విడిచి పెట్టవలసి ఉంటుంది.డబ్బు ఖర్చుకు వెనుకాడరాదు.అప్పుడే ఒక వ్యక్తి రాజకీయ నాయకుడవుతాడు.అదే మంచు విష్ణు తనకు ఓటు వేయాలనుకున్న వారికి సొంత ఖర్చులతో టికెట్లు పెట్టి వారందరినీ ఇక్కడికి డ్రైవ్ చేసి మరీ ఓట్లు వేయించుకున్నారు..

ఇదే మెగా ఫ్యామిలీకి విజయాన్ని దూరం చేసిన ప్రధానాంశం.

అంటే కాపులకు ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేసి గెలుపు సాధించాలన్న విషయం బొత్తిగా తెలియదు.గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు ఇంగ్లీష్ మీడియా నుంచి వచ్చిన బిరుదు ఏంటంటే పెద్దగా డబ్బు ఖర్చు చేయకుండా జనసేనాని మంచి ప్రయత్నం చేశారని.

ఈ బిరుదులు సత్కారాలు రాజకీయాలకు పూర్తి వ్యతిరేకం.ఇప్పుడున్న పరిస్థితుల్లో 'కమ్మ'లే అధికారానికి ఆమడ దూరం జరిగిన స్థితిగతులు కనిపిస్తున్నవి.

నారా లోకేష్ కొత్తతరం నాయకుడు. 'డైరెక్ట్ క్యాష్ బెనిఫిషరీ స్కీమ్స్' వర్కవుట్ చేస్తే బావుంటుందని ఆయన గుర్తించినా

'పాత కాలపు' కమ్మ మనస్థత్వానికి చెందిన చంద్రబాబు ద్వారా అదంత తేలిగ్గా సాధ్యం కాలేదు.మొదట గుర్తించింది తామే అయినా దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో 'కమ్మ కూటమి' ఘోరంగా విఫలమైంది.

ఓట్లను భారీ ఎత్తున నోట్లతో కొనడం అనే ప్రక్రియకు మూలపురుషుడు చంద్రబాబు.ఈ దేశంలో ఐటీ ని ప్రవేశపెట్టిన వ్యక్తిని తానే అనుకుంటాడు చంద్ర బాబు. అది నిజమో కాదో కానీ ఈ దేశంలో భారీ ఎత్తున డబ్బు, మద్యంతో ఓట్లు కొనడానికి ఆధ్యుడు మాత్రం చంద్రబాబే.

ఏదైనా సరే... ఎవరిని కొట్టాలి- ఎవరికి పెట్టాలి? అన్నది క్రిస్టల్ క్లియర్ గా తెలిసిన వారిగా 'రెడ్డి'సామాజికవర్గాన్ని అంచనా వేయాలి.'వైయస్ ఒక రూపాయి తిన్నా.. వెంట ఉన్న వారికి సగం పైసలొస్తాయంట కదా?' అని గతంలో నేరుగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' షోలో చంద్రబాబును వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించారు.చంద్రబాబు ఈ సూత్రాన్ని పూర్తిగా మరిచే పోయారు.ఇప్పటికీ ఆయన చెప్పిన మాట మీద నిలబడరన్న మాట బలంగా ప్రచారంలో ఉంది.చంద్రబాబు హామీలకు జనాల్లో పెద్ద నమ్మకం లేదు.

''అప్పట్లో ఉన్న పరిస్థితి వేరు- ఇప్పుడున్న సిట్యువేషన్ వేర''ని బాహటంగానే చంద్రబాబు చెబుతుంటారు. ఇక్కడే కమ్మ నాయకత్వం ఒకింత వెనకడుగు వేస్తోంది.జనానికి కావల్సిందేంటో తెలిసినా తమకున్న 'కుల- మూల ధన సిద్ధాంతాల' ప్రకారం తమవారికి దోచిపెట్టడం తప్ప తరతమ బేధాలు లేకుండా అందరికీ మేలు చేసేలా ముందడుగు వేయలేక పోతున్నారు.ఇటీవల తత్వం బోధపడినందున ఇప్పుడున్న పథకాలను అలాగే ఉంచుతానంటూ చంద్రబాబు జనాన్ని నమ్మబలికే యత్నం చేస్తున్నారు.కానీ ప్రజలకున్న అనుభవాలు వేరు.ఎన్టీఆర్ తీసుకొచ్చిన మద్యపాన నిషేధం, రెండ్రూపాయల కిలో బియ్యం వంటివి కొన్నాళ్ల తర్వాత ఆయన ఎలా కనుమరుగు చేశారో గత కాలపు ఓటర్లకు బాగా తెలుసు.

కాగా వైఎస్.రాజశేఖరరెడ్డి వారసునిగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ య‌వనిక మీదకు దూసుకొచ్చిన జగన్ మోహనరెడ్డి అలా కాదు.తన 'రెడ్డితనాని'కి తెలిసిందల్లా ఇవ్వాలంటే ఇవ్వడం- అందుకోసం ఎందాకైనా తెగించి పోరాడడం.అందుకే 'చెప్పాడంటే చేస్తాడంతే'అనే మాట బాగా ప్రజాదరణ పొందింది. ఇక్కడే జనం జగన్ బుట్టలో పడిపోతున్నారు.మొన్నటికి మొన్న అయ్యప్పస్వామి భక్తుల బస్సుకు ప్రమాదం జరిగి కొందరు చనిపోతే ఒక్కో మృతుడికి పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అడక్కుండానే ఇప్పించేశారు..

దటీజ్ జగన్ మోహనరెడ్డి!

ఇది 'ఇన్ స్టంట్ 'యుగం.జనం తమ సంపాదనకూ, పెరిగిన ఖర్చులకూ వ్యత్యాసం చాలా పెరగ‌డంతో దిగువ మధ్య తరగతి వారు అదనపు ఆదాయాల వైపు అర్రులు చాస్తున్నారు.ఈ క్రమంలో భాగంగా తమకు అందివచ్చే అవకాశాలేవి? ఏయే రూపాల్లో ధనార్జన సాధ్యం ? అన్న విషయంలో వారికి ఎంతో స్పష్టత ఉన్నది.'నీ ఉట్టి మాటలు,సిద్ధాంతాలు.. మా ఆకలి దప్పులకు,అవసరాలకు సమాధానంగా కనిపించడం లేదు.లక్ష చెప్పు.. కోటి చెప్పు.మాటలు వేస్ట్.. క్యాష్ అండ్ క్యారి' అని ప్రజలు అంటున్నారు.ఈ మూల సూత్రం తెలియకుండా ఎంత పెద్ద కమ్మ నాయకు డయినా,'నాయుడు' అయినా,మరెంత 'పెద్ద కాపు లీడర్లై'నా రాజ్యాధికారం చేపట్టడం అసాధ్యం.ఈ విషయంలో తమ కుల సిద్ధాంతాలను పక్కన పెడితేనే ఏదైనా సాధ్యం కావచ్చు.

''నేను ముఖ్యమంత్రినైతే నీకు కాసుల పంటే'' అని ఎవరైతే నిరూపించగలరో ఎవరైతే అధికారంలోకి రాక ముందే అది ఎస్టాబ్లిష్ చేయగలరో వారినే 'రాజ్య'లక్ష్మి వరిస్తుంది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.ఈ విషయం గుర్తించకుండా 'కాపు కుల'స్తులు రాజ్యం చేపట్టడం సాధ్యమేనా? ఎంత భావోద్వేగాన్ని రగిలించినా, ఎన్నేసి కులాభిమానాలను రెచ్చగొట్టినా,వారి అవసరాలకు మించిన కులం లేదు, మతం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో రాణించడం అన్నది సాధారణ క్రీడ.సాహసంతో,అసమాన ధైర్యంతో కూడినది.

''మాకు సినిమాల్లో హీరో పవనే కావచ్చు కానీ, రాజకీయాల్లో మాత్రం జగనన్నే హీరో'' అని ఏపీలో సగటు కాపు ఓటర్ల మాట.

ఇక్కడ కాపు కులాభిమానం ఎక్కడికెళ్లింది? ఇక్కడే ఉంది అసలు కిటుకు.తాము అభిమానించడానికి పనికొచ్చే కులం,ఆకలిదప్పులను తీర్చడానికి పనికి రాదు.ఎవరైతే జనం ఆకలిదప్పులు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తారో వారే రాజకీయ అధికారం చేబట్టగలరు త‌ప్ప చప్పటి సిద్ధాంతాలు,నాలిక గీసుకోడానికి కూడా పనికి రాని కులాభిమానాల వల్ల ప్రయోజనం లేదు.

First Published:  21 Dec 2022 12:02 PM IST
Next Story