తెలుగుదేశంలో `కళా`విహీనం.. పాలిటిక్స్‌కి ఎండ్ కార్డ్..?
కిమిడి కళా వెంకటరావు రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకోవడం ఆరంభించాయి. తనని అధ్యక్షుడిగా తీసేసిన అవమానం కంటే, టీడీపీలో తనకి బద్ధశత్రువైన కింజరాపు అచ్చెన్నాయుడుని అధ్యక్షుడిగా చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
వివాదాలకి దూరంగా, అధిష్టానానికి విధేయంగా అందలాలు ఎక్కారు. ప్రజాబలం కంటే అదృష్టమే ఆయనని రాజకీయ నాయకుడిగా నిలబెట్టింది. ఒకానొక దశలో ప్రజారాజ్యంలో చేరి డిపాజిట్లు కోల్పోవడంతో పొలిటికల్ కెరీర్‌కి ఎండ్ కార్డు పడింది అని అంతా అనుకున్నారు. అనూహ్యంగా ఆయన మళ్లీ టీడీపీలో చేరడం, ఎమ్మెల్యేగా గెలవడం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడం, మంత్రి పదవి దక్కించుకోవడం వంటివన్నీ జాక్ పాట్‌లా తగిలాయి. ఆ అదృష్ట నాయకుడే కిమిడి కళా వెంకటరావు.
ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన కళా వెంకటరావు టీడీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. అయితే తన తమ్ముని భార్య చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన కిమిడి మృణాళినికి మంత్రి పదవి దక్కడంతో కళా వెంకటరావుకి టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. రెండున్నరేళ్లు ముగిశాక మళ్లీ కళాకి మంత్రి పదవి వరించింది. పార్టీ అధ్యక్షుడిగా, మంత్రిగా క్షణం తీరికలేనంత బిజీ అయిపోయారు. నియోజకవర్గానికి, ప్రజలకి దూరమైపోయారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన గొర్లె కిరణ్ కుమార్ చేతిలో 19 వేలకి పైగా ఓట్ల తేడాతో దారుణ పరాజయం పాలయ్యారు. గోరుచుట్టుపై రోకలిపోటులా టీడీపీ అధ్యక్ష పదవి పోయింది.
ఇక్కడి నుంచే కిమిడి కళా వెంకటరావు రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకోవడం ఆరంభించాయి. తనని అధ్యక్షుడిగా తీసేసిన అవమానం కంటే, టీడీపీలో తనకి బద్ధశత్రువైన కింజరాపు అచ్చెన్నాయుడుని అధ్యక్షుడిగా చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పటినుంచీ తెలుగుదేశంలో కిమిడి `కళా`విహీనం ఆరంభమైంది. వారసుడిగా కొడుకు రామమల్లిక్ నాయుడుని ఎంతగా ప్రమోట్ చేసినా కనీసం కార్యకర్తలు నలుగురిని ఆకట్టుకోలేనంత నిస్సహాయుడు కావడంతో కిమిడి కళావెంకటరావు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
మరోవైపు తాము దశాబ్దాలుగా రాజకీయాలు నెరిపిన పాలకొండ ఎస్టీ, రాజాం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు కావడంతో కుటుంబంలో వాళ్ల పదవుల ఆశలు ఆవిరయ్యాయి. తమ్ముడు కిమిడి గణపతిరావు భార్య కిమిడి మృణాళిని కన్నవారి ఊరైన చీపురుపల్లికి వలస వెళ్లారు. ఈ దంపతులు పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుని కొడుకు నాగార్జునని వారసుడిగా తీసుకొచ్చారు. నాగార్జున చీపురుపల్లి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తన తమ్ముడి కొడుకుకి రాజకీయ వారసత్వం దక్కినా, తన తనయుడికి టికెట్ తెచ్చుకోవడం అసాధ్యంగా కనిపిస్తుండటంతో కళా వెంకటరావు తన పాతతరం రాజకీయాలకి పదును పెడుతున్నారు.
తనకి ఎచ్చెర్ల టికెట్ దక్కకపోతే, ఎంపీగా తనని పోటీచేయమంటారని, అదే జరిగితే.. తన కొడుక్కి ఎచ్చెర్ల అసెంబ్లీ టికెట్ ఇస్తేనే తాను ఎంపీగా బరిలో దిగుతాననే విధంగా అధిష్టానం ముందు డిమాండ్ చేయాలనుకుంటున్నారట. అటు ఎచ్చెర్ల ఎమ్మెల్యే సీటుకి, ఇటు విజయనగరం ఎంపీ సీటుకి కూడా టీడీపీ వ్యూహకర్తలు కొత్త మొఖాలని దింపే సన్నాహాల్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే వారసుడికే కాదు, తనకే పోటీ చేయడానికి సీటూ-స్థానం లేని కిమిడి కళా వెంకటరావు రాజకీయ జీవితానికి ఎండ్ కార్డు పడినట్టే!