జగన్ ప్లాన్ వర్కవుటవుతుందా?
జగన్ ఏమో పాజిటివ్ పాయింట్లతో మహిళలకు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తుంటే.. చంద్రబాబు, పవన్‌లు మహిళలను ప్రభుత్వానికి దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు, ఎవరి వ్యూహాలు వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ముఖ్యంగా మహిళా ఓట్లపైనే ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నట్లు కనబడుతోంది. ఎందుకంటే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమ్మఒడి, చేయూత, కాపునేస్తం, జగనన్న మార్టులు, డ్వాక్రా గ్రూపులకు సున్నావడ్డీ పథకం, ఇళ్ళ పట్టాలు, పక్కా ఇళ్ళు లాంటివన్నీ అచ్చంగా మహిళకే అమలవుతున్నాయి. విద్యకు సంబంధించిన అన్నీ పథకాల లబ్ధి మహిళలకే అందుతోంది.
ఇక 2.67 లక్షల వలంటీర్లలో సుమారు 60 శాతం అమ్మాయిలే ఉన్నారు. అలాగే సచివాలయం ఉద్యోగుల్లో కూడా అమ్మాయిలకే ప్రాధాన్యతిచ్చారు. ఇవికాకుండా కార్పొరేషన్లలో నియామకాలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లుగా కూడా మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇలా ఏరకంగా చూసుకున్నా 80 శాతం మహిళలకే ప్రాధాన్యత దక్కుతోంది. ఇదంతా ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో మహిళల ఓట్లను కొల్లగొట్టి మంచి మెజారిటీతో గెలవటానికే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
ఇది గమనించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుడా మహిళా బాటలోనే నడుస్తున్నారు. జగన్ ఎన్నికలకు కౌంటర్ ప్లానుగా తెలుగు మహిళలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయించేందుకు బస్సు యాత్రలు మొదలుపెట్టించారు. పవన్ కూడా వీరమహిళల ఆధ్వర్యంలో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారు. జగన్ ఏమో పాజిటివ్ పాయింట్లతో మహిళలకు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తుంటే వీళ్ళిద్దరేమో మహిళలను ప్రభుత్వానికి దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మహిళా ఓట్లను ఆకట్టుకునేందుకే చంద్రబాబు కూడా మినీ మ్యానిఫెస్టోలో మూడు సిలిండర్లు, మహాశక్తి, ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించారు. మహిళల కోసం ఇప్పటివరకు పవన్ ప్రత్యేకంగా పథకాలేవీ ప్రకటించలేదు. అయితే మహిళలను వైసీపీకి దూరం చేసేందుకే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందనే ఆరోపణలతో బురదచల్లేస్తున్నారు. ఎంత వీలైతే అంతమంది మహిళను వైసీపీకి దూరం చేయటమే టార్గెట్‌గా పవన్ ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే ఓటర్లలో కూడా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు కాబట్టి. మెజారిటీ ఓటర్ల మద్దతు ఎవరికుంటే రాబోయే ఎన్నికల్లో వాళ్ళదే విజయమనే మాట వినిపిస్తోంది. మరి జగన్ ప్రయత్నం ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.