Telugu Global
Andhra Pradesh

మళ్ళీ ఈ డైలాగులు వినబడతాయా?

జగన్ మీదున్న ఆరోపణల్లో ఇంతవరకు ఏ ఒక్కటి నిరూపణ కాలేదు. కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో జరిగిన రూ. 371 కోట్ల అవినీతిలో చంద్రబాబే కీలక సూత్రధారని ఏసీబీ కోర్టు ధృవీకరించింది.

మళ్ళీ ఈ డైలాగులు వినబడతాయా?
X

స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబునాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల ట్రేడు మార్క్ డైలాగులు కొన్ని వినబడవేమో. అవేమిటంటే చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమా, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ఎప్పుడు ఏమి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని డైలాగులను ఉపయోగిస్తుంటారు.

అవేమిటంటే ‘ఏమి పీక్కుంటావో పీక్కో, ఒక్క వెంట్రుకను కూడా పీకలేవు, నీకు చేతనైంది చేస్కో, నా బొచ్చుకూడా పీకలేవు’ మీ నాయన వైఎస్సార్ వల్లే కాలేదు ఇక నువ్వెంత? నువ్వేం చేయగలవని .. చంద్రబాబు ఎన్నిసార్లు రెచ్చగొట్టుంటారో లెక్కేలేదు. విషయం ఏదైనా సరే చంద్రబాబు దగ్గర నుండి లోకేష్ వరకు తమ్ముళ్ళంతా ఇదే డైలాగులను పదేపదే చెప్పేవాళ్ళు.

సీన్ కట్ చేస్తే తాను ఏమి పీకగలడు, ఏమి చేయగలడు అన్న విషయాన్ని అరెస్టు చేయటం ద్వారా చంద్రబాబుకు జగన్ రుచి చూపించారు. ప్రభుత్వం అరెస్టు తర్వాత ఏసీబీ కోర్టు కూడా చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ రిమాండ్‌ను చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టులో చాలెంజ్ చేయబోతున్నారు. అక్కడ ఏమవుతుందన్నది వేరే సంగతి. పదే పదే జగన్‌ను రెచ్చగొడితే ఏమవుతుంది అనేందుకు చంద్రబాబు అరెస్టు, రిమాండే తాజా ఉదాహరణ.

మరి ఇప్పుడు కూడా జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు మినహాయించి లోకేష్+ఇతర తమ్ముళ్ళు మళ్ళీ పై డైలాగులతో చాలెంజ్ చేయగలరా? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

సైకో ముఖ్యమంత్రని, క్రిమినల్ ముఖ్యమంత్రని, వేలాది కోట్లు దోచుకున్న దోపిడీదారుడని పదే మాట్లాడటం కాకుండా ఎల్లో మీడియాతో కూడా రాయించారు. ఇప్పుడు చంద్రబాబు మీద కూడా అవినీతిపరుడే అని ముద్రపడిపోయింది. జగన్ మీదున్న ఆరోపణల్లో ఇంతవరకు ఏ ఒక్కటి నిరూపణ కాలేదు. కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో జరిగిన రూ. 371 కోట్ల అవినీతిలో చంద్రబాబే కీలక సూత్రధారని ఏసీబీ కోర్టు ధృవీకరించింది. మరి హైకోర్టులో వాదనలు ఎలాగుంటాయి, తీర్పు ఎలా వ‌స్తోంద‌ని చూడాల్సిందే.


First Published:  11 Sept 2023 6:31 AM GMT
Next Story