బాలినేని కూడా నెల్లూరు రెడ్ల రూటు పట్టారా..?
గతంలో ఓ సారి తనకి అవకాశం దక్కాలే కానీ టీడీపీని క్లీన్ స్వీప్ చేయిస్తానని ప్రతిన పూనిన బాలినేని.. అదే టీడీపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా నెల్లూరు రెడ్ల రూటు పట్టారా..? అనే అనుమానాలు బలపడుతున్నాయి. అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఉమ్మడి నెల్లూరు జిల్లాకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలని వైసీపీ సాగనంపేసింది. దీనికోసం నిరీక్షిస్తున్నట్టు వారు కూడా టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆ ముగ్గురు బాట పట్టేలా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మంత్రి పదవి నుంచి తప్పించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి తన బావ వైవీ సుబ్బారెడ్డితో ఆధిపత్య పోరు ఉంది. దీనికి తోడు తనవర్గం కాని ఆదిమూలపు సురేష్‌ని మంత్రిగా కొనసాగించి తనని తప్పించడంతో మరింత ఆగ్రహానికి గురయ్యారు. కోఆర్డినేటర్ బాధ్యతలు ఇచ్చినా తన మాట వినేవారు లేకపోవడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి పక్కచూపులు చూస్తున్నారని వైసీపీలో చర్చించుకుంటున్నారు.
గతంలో ఓ సారి తనకి అవకాశం దక్కాలే కానీ టీడీపీని క్లీన్ స్వీప్ చేయిస్తానని ప్రతిన పూనిన బాలినేని.. అదే టీడీపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. బాలినేని కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో వైసీపీ అధిష్టానం కూడా అలర్ట్ అయ్యింది. బాలినేని రిజైన్ చేసిన పార్టీ సమన్వయకర్త పదవిని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి అప్పగించారు. నెల్లూరు, ప్రకాశం బాధ్యతలను తీసుకున్న ఎంపీ విజయ సాయిరెడ్డి వెంటనే రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లో బాలినేని ఇంటికి వెళ్లిన సాయిరెడ్డి దాదాపు 2 గంటల పాటు మంతనాలు జరిపారు. ఈ చర్చలు ఏమయ్యాయో కానీ, బాలినేని మాత్రం అలక వీడలేదు.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ మరోసారి బాలినేనితో చర్చించారు. గతంలోనూ రెండు సార్లు బాలినేనితో మాట్లాడినా, ఆయన రాజీనామాని వెనక్కి తీసుకోలేదు. తన డిమాండ్లు కూడా సీఎం ఆమోదించినట్టు లేదు. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు అంశం మరోసారి చర్చకొచ్చింది.