కన్నా.. జనసేనలో చేరతారా? సైకిలెక్కుతారా?
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కీలక నేతగా వ్యవహరించిన కన్నా లక్ష్మీనారాయణ ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ ఆయన చాలా దూకుడుగా వ్యవహరించారు.
బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన వ్యవహార శైలి ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లోనే అనుమానాలకు తావిచ్చేలా ఉంది. కన్నా బీజేపీని వీడటం ఖాయమనే అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయి.
కన్నా తీరును గమనిస్తే.. వచ్చే 2024 ఎన్నికల్లో పోటీ చేయడం, ఆ ఎన్నికల్లో తాను తప్పనిసరిగా గెలుపొందడం లక్ష్యంగా ఆయన ప్రణాళిక రూపొందించుకుంటున్నట్టు తెలుస్తోంది. వీటి ఆధారంగానే తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కీలక నేతగా వ్యవహరించిన కన్నా లక్ష్మీనారాయణ ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ ఆయన చాలా దూకుడుగా వ్యవహరించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తీరులో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎన్నికైన తర్వాత నుంచి బీజేపీలో కన్నాకు ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది.
ఇది కన్నాను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ఈ విషయాన్ని గతంలో రెండు మూడుసార్లు ఆయన బహిరంగంగా వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయితే రాబోయే ఎన్నికల్లో బీజేపీ సింగిల్‌గా పోటీచేస్తే మాత్రం రాష్ట్రంలో ఏ స్థానంలోనూ గెలిచే అవకాశాలు లేవని భావిస్తున్న ఆయన పొత్తులకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీ నుంచి అయినా ఈసారి బరిలోకి దిగాలని కన్నా భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదే విషయాన్ని ఆయన తన అభిమానులు, కార్యకర్తల వద్ద పదే పదే ప్రస్తావిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ నాలుగుసార్లు గెలుపొందిన పెదకూరపాడు నియోజకవర్గం ఆయనకు ఎంతో కీలకమైన ప్రాంతం. ఆయనకు అక్కడ పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది. ఇప్పటికీ ఆయన్ని అభిమానించే నాయకులు అక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు బీజేపీలోని పెదకూరపాడు నేతలంతా పెదకూరపాడులో భేటీ కానున్నారు.
ఈ భేటీలో వీరంతా కలిసి బీజేపీకి రాజీనామా చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత.. కన్నా నిర్ణయం వెలువడే అవకాశముందని సమాచారం. ఆయన బీజేపీలోనే కొనసాగుతారా? జనసేనలో చేరతారా? లేక టీడీపీలో చేరతారా అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటుచేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీకి కన్నా లక్ష్మీనారాయణ గైర్హాజరు కావడం గమనార్హం.