ఈ సారైనా మర్రికి మంత్రి పదవి హామీ నెరవేరుతుందా..?
విడదల రజిని గెలిచింది. మంత్రి అయ్యింది. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటి నాలుగో ఏడాదిలోకి ప్రవేశించబోతోంది. మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ హామీయే నెరవేరలేదు.
ఏపీలో ముందస్తు ముచ్చట్లు వినిపిస్తున్నాయి. వైసీపీ పెద్దలు మాత్రం అటువంటిదేమీ లేదు, పూర్తిస్థాయి పదవీకాలం అనుభవిస్తామని, ముందస్తు మాటే లేదంటున్నారు. అయితే వైసీపీ అధిష్టానం వేస్తున్న అడుగులు, తీసుకుంటోన్న నిర్ణయాలు ఎన్నికల సన్నాహాలను తలపిస్తున్నాయి. ఈ దిశగా మరోసారి మంత్రి మండలిని విస్తరించే యోచనలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మార్పులు చేర్పులు ఉంటాయని ఊహాగానాలు, విశ్లేషణలు వస్తున్నాయి.
తాను ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు మాత్రమే ఈసారి మంత్రివర్గంలో మార్పులు పరిమితం కావొచ్చని తెలుస్తోంది. చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కి 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఈ సారి మంత్రివర్గ విస్తరణ ప్రధాన ఉద్దేశం అయి వుండొచ్చని వైసీపీలో టాక్ నడుస్తోంది.
గెలిచే అవకాశం ఉందని, ఆర్థికంగా కూడా బలమైన అభ్యర్థి అయిన విడదల రజినికి వైసీపీ టికెట్ ఇచ్చిన జగన్ ఆమెను గెలిపిస్తే మర్రి రాజశేఖర్ ని ఎమ్మెల్సీని చేసి.. మంత్రి పదవిని ఇస్తానని జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. విడదల రజిని గెలిచింది. మంత్రి అయ్యింది. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటి నాలుగో ఏడాదిలోకి ప్రవేశించబోతోంది. మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ హామీయే నెరవేరలేదు. ఇంకా మంత్రిని ఎలా చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మర్రి రాజశేఖర్‌కి ఏ అవకాశమూ దక్కకుండా చేయడంలో విడదల రజిని తెరవెనుక ప్రయత్నాలే కారణమని మర్రి అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం రాజ్యసభకి పంపుతారని కూడా ప్రచారం సాగింది. అది కూడా దక్కకపోవడంతో మర్రి రాజశేఖర్ రాజకీయాల పట్ల వైరాగ్యం ప్రకటించారు. మళ్లీ న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలు పెట్టారు.
అధిష్టానం ఇచ్చిన హామీల మేరకు మర్రి రాజశేఖర్‌ని అనునయించారని, ఈ విడతలో ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇవ్వడం ఖాయమని ఆయన అభిమానులు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. వైసీపీలో ఇదే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. కమ్మ సామాజికవర్గం నుంచి ఎవరూ మంత్రివర్గంలో లేకపోవడం, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కి అధిష్టానంతో గ్యాప్ ఉండటం మర్రికి కలసి వచ్చే అంశమని అంటున్నారు. పార్టీ పట్ల విధేయుడిగా ఉన్న మర్రి రాజశేఖర్‌ని ఈసారి ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమనే చర్చ నడుస్తోంది. అయితే చిలకలూరిపేట ఎమ్మెల్యే, మంత్రి విడదల రజిని మాట ప్రభుత్వ పెద్దల వద్ద బాగా చెల్లుబాటు అవుతోందని, ఆమెని కాదని మరీ మర్రికి మంత్రి పదవి ఎలా కట్టబెడతారు? అనే మరో వాదనా వినిపిస్తోంది.