Telugu Global
Andhra Pradesh

దసరా నాటికి పర్యవేక్షకులు.. జగన్ ప్రయోగం సక్సెస్ అవుతుందా.. ?

ఎమ్మెల్యే చుట్టూ కోటరీ ఉంటుంది, ఉన్నవి, లేనివి చెప్పి ఆహా ఓహో అంటుంది. పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. ఎమ్మెల్యేకి మాత్రం అంతా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ పర్యవేక్షకుడి దృష్టికోణం అలా ఉండదు.

దసరా నాటికి పర్యవేక్షకులు.. జగన్ ప్రయోగం సక్సెస్ అవుతుందా.. ?
X

2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకుంది. 2024లో 175 సీట్లు టార్గెట్ గా పెట్టుకుంది. ఈ క్రమంలో సీఎం జగన్ ఓ చిన్న ప్రయోగం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక పర్యవేక్షకుడిని పంపించబోతున్నారు. అంటే అప్పటికే అక్కడ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఈ పర్యవేక్షకుడు అదనంగా వెళ్తారు. అక్కడ పార్టీ పరిస్థితిని అంచనా వేస్తారు. ఎమ్మెల్యే చుట్టూ కోటరీ ఉంటుంది, ఉన్నవి, లేనివి చెప్పి ఆహా ఓహో అంటుంది. పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. ఎమ్మెల్యేకి మాత్రం అంతా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ పర్యవేక్షకుడి దృష్టికోణం అలా ఉండదు. అసలు అక్కడ పార్టీ వాస్తవ పరిస్థితి ఏంటి, ప్రతిపక్షం బలం ఎంత అనే అంచనాకి వచ్చి ఆ సమాచారాన్ని అధిష్టానానికి చేరవేయడం, దిద్దుబాటు చర్యలు తీసుకోవడం ఆయన పని. దీనికోసమే 175 నియోజకవర్గాలకు 175మంది పర్యవేక్షకులను ఎంపిక చేస్తున్నారు. అంటే సీఎం జగన్ నియోజకవర్గానికి కూడా మరో నాయకుడు పర్యవేక్షకుడిగా వెళ్తారనమాట. ఈ కసరత్తు దసరా నాటికి ఓ కొలిక్కి వస్తుంది.

సక్సెస్ అవుతుందా.. ?

ఇప్పటికే తాడికొండ నియోజకవర్గంలో ఇలాంటి ప్రయోగం బెడిసికొట్టినట్టు తెలుస్తోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవితోపాటు, అక్కడ అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ని నియమించడంతో గందరగోళం నెలకొంది. రెండు వర్గాలుగా పార్టీ నాయకులు విడిపోయారు. శ్రీదేవి ఇంకా అసంతృప్తిలోనే ఉన్నారు. ఈ దశలో ఇప్పుడు రాష్ట్రమంతా ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానం ఉంది.

ఎమ్మెల్యేల ఇగో హర్ట్ చేసినట్టేనా.. ?

ఎమ్మెల్యేలే పార్టీకి అసలు సిసలు ప్రతినిధులు, కానీ వారు చేసిన, చేస్తున్న తప్పులకు పార్టీ బలవ్వకూడదనేది సీఎం జగన్ ఆలోచన. అందుకే ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆయన పార్టీని కాపాడుకునేందుకు పర్యవేక్షకులను సిద్ధం చేస్తున్నారు. వీరితో ఎమ్మెల్యేలు గొడవపడినా, ఘర్షణ వాతావరణం నెలకొన్నా కూడా.. అంతిమంగా పార్టీకి మేలు జరగాల్సిందేననే నిర్ణయంతో ఉన్నారు. అందుకే తన నియోజకవర్గానికి కూడా ఓ పర్యవేక్షకుడిని పంపిస్తున్నానంటున్నారు జగన్. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క నియోజకవర్గం కూడా చేజారకూడదనే ఆలోచనలో ఉన్నారు జగన్. అందుకే కుప్పంలో సైతం ఆయన పర్యటించారు. ఈ క్రమంలో పర్యవేక్షకుల ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.

First Published:  24 Sept 2022 8:48 AM IST
Next Story