Telugu Global
Andhra Pradesh

జగన్ కోర్టుకు హాజరవుతారా?

ఫిబ్రవరి 15వ తేదీన జరగబోయే విచారణలో జగన్ కచ్చితంగా హాజరుకావాల్సిందే అని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. జనవరి 31వ తేదీ అంటే మంగళవారం జరిగిన విచారణకు హాజరుకాకపోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

జగన్ కోర్టుకు హాజరవుతారా?
X

కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి వైఖరిపైనే ఆధారపడుంది. ఫిబ్రవరి 15వ తేదీన జరగబోయే విచారణలో జగన్ కచ్చితంగా హాజరుకావాల్సిందే అని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. జనవరి 31వ తేదీ అంటే మంగళవారం జరిగిన విచారణకు హాజరుకాకపోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2018, అక్టోబర్ 25వ తేదీన విశాఖపట్నం ఎయిర్ పోర్టు లాంజ్‌లో జగన్‌పై శ్రీనివాసరావు కోడి కత్తితో దాడిచేసిన ఘటన అందరికీ తెలిసిందే.

ఎయిర్ పోర్టు లాంజ్‌లో జరిగిన ఘటన కాబట్టి రెగ్యులర్ పోలీసులు ముందు కేసు నమోదు చేసుకుని తర్వాత విచారణకు ఎన్ఐఏకి బదిలీ చేశారు. దాదాపు నాలుగేళ్ళుగా ఎన్ఐఏ కోర్టులో కేసు విచారణ జరగనేలేదు. దాంతో నిందితుడు శ్రీను రిమాండులోనే ఉండిపోయారు. శ్రీనివాస్ తరపు లాయర్ పోరాటం కారణంగా మొత్తానికి కేసు విచారణకు ఎన్ఐఏ కోర్టు రెడీ అయ్యింది. అయితే మొదటి విచారణలోనే మొదటి సాక్షి దినేష్ కుమార్‌తో పాటు జగన్ కూడా హాజరుకాలేదు.

ఎయిర్ పోర్టు అసిస్టెంట్ కమాండెంట్ దినేష్‌తో పాటు బాధితుడు జగన్ కూడా హాజరుకాకపోవటంతో కోర్టు విచారణను ఫిబ్రవరికి వాయిదావేసింది. అయితే సాక్షి+బాధితుడు ఇద్దరు గైర్హాజరుపైన అసంతృప్తి వ్యక్తం చేసింది. సాక్షి, బాధితుడు హాజరుకాకపోతే విచారణ ఎలా జరుగుతుందంటూ జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తర్వాత విచారణకు జగన్ హాజరవుతారా.. లేదా.. అన్నది సస్పెన్సుగా మారింది. జడ్జేమో సాక్ష్యులు, బాధితుడు తప్పకుండా విచారణకు హాజరుకావాల్సిందే అని ఆదేశించారు.

కేసు విచారణ జగన్ వైఖరిపైన ఆధారపడుంది. జగన్ పెద్ద మనసు చేసుకుని నిందితుడిని క్షమించి వదిలేయమని చెప్పే అవకాశముందని పార్టీలో టాక్ వినబడుతోంది. జగన్ ఆ పని చేస్తే కోర్టు కూడా క్షమించే అవకాశముందట. ఎందుకంటే రిమాండ్ పేరుతోనే శ్రీనివాస్ నాలుగేళ్ళుగా జైల్లోనే ఉంటున్నాడు కాబట్టి. ఇది జరగాలంటే జగన్ కచ్చితంగా ఫిబ్రవరి 15వ తేదీన జరగబోయే విచారణకు హాజరుకావాల్సుంటుంది. జగన్ మనసులో ఏముందో స్పష్టంగా బయటకు తెలియ‌డంలేదు. మరి జగన్ కేసు విచారణకు హాజరవుతారా?

First Published:  1 Feb 2023 11:39 AM IST
Next Story