ఆ నియోజకవర్గాల్లో చంద్రబాబు సక్సెస్ అవుతారా?
ఎస్సీ, ఎస్టీలకు 36 నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7 సీట్లున్నాయి. ఈ 36 నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లను గెలవాలని చంద్రబాబు నాయుడు వ్యూహాలు రెడీ చేస్తున్నట్లు సమాచారం.
గడచిన రెండు వరుస ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడును బాగా కలవర పెడుతున్నాయి. ఎంత ప్రయత్నించినా గెలుపు దక్కటంలేదు. 2014లో కొన్ని సీట్లలో గెలిచినప్పటికీ 2019 ఎన్నికల్లో మాత్రం ఘోర అవమానం తప్పలేదు. ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఏవంటే రిజర్వుడు నియోజకవర్గాలు. ఎస్సీ, ఎస్టీలకు 36 నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7 సీట్లున్నాయి. 2019 ఎన్నికల్లో 36 నియోజకవర్గాల్లో వైసీపీ 35 స్థానాల్లో గెలుచుకోగా టీడీపీ కేవలం ఒకే ఒక్కసీటు గెలుచుకుంది
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండెపి ఎస్సీ నియోజకవర్గంలో టీడీపీ తరపున డోలా బాలవీరాంజనేయస్వామి మాత్రమే గెలిచారు. 2014 ఎన్నికల్లో కూడా పై నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది చాలా కొద్ది నియోజకవర్గాలు మాత్రమే. రెండు వరుస ఎన్నికల్లో రిజర్వుడు నియోజకవర్గాల్లో టీడీపీకి బాగా గట్టిదెబ్బ తగిలింది. అందుకనే రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ నియోజకవర్గాలను గెలవాలని చంద్రబాబు నాయుడు వ్యూహాలు రెడీ చేస్తున్నట్లు సమాచారం.
36 నియోజకవర్గాల్లో దేనికదే ప్రత్యేక వ్యూహాన్ని రెడీ చేసి మెజారిటీ సీట్లను గెలుచుకోవాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటికే రిజర్వుడ్ సీట్లపై రెండు మూడు మీటింగులు నిర్వహించారట. అయితే ఇది ఎంతవరకు సాధ్యమో అర్థంకావటంలేదు. ఎస్సీ నియోజకవర్గాలను మినహాయిస్తే ఏడు ఎస్టీ స్థానాల్లో 2014, 19 ఎన్నికల్లో ఒక్కటి కూడా గెలవలేదు. ఎస్టీ నియోజకవర్గాలను వైసీపీ గంపగుత్తగా గెలుచుకుంటోంది. ఇదే చంద్రబాబును బాగా కలవరపెడుతున్నది. రిజర్వుడు స్థానాల్లో ఎలా పాగావేయాలో అర్థంకావటంలేదు.
తాజా పరిణామాల్లో వచ్చే ఎన్నికల్లో అయినా 36 నియోజకవర్గాల్లో ఎన్నింటిలో టీడీపీ గెలుస్తుందో అర్థంకావటంలేదు. ఒకప్పుడు రిజర్వుడ్ స్థానాల్లో కూడా టీడీపీ బలంగానే ఉండేది. ఎప్పుడైతే వైసీపీ ఆవర్భవించిందో అప్పటి నుండే టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. ఇవే కాకుండా టీడీపీ తరపున పోటీ చేస్తున్న ముస్లిం అభ్యర్థులు కూడా గెలవలేకపోతున్నారు. కర్నూలు, గుంటూరు, కడప జిల్లాల్లో ముస్లిం నేతలు గెలిచిన స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. ఓపెన్ క్యాటగిరి స్థానాల సంగతి ఎలాగున్నా రిజర్వుడ్ సీట్లు మాత్రం చంద్రబాబును బాగా కలవరపెట్టేస్తున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాల్సిందే.