Telugu Global
Andhra Pradesh

జనసేనకు చంద్రబాబు న్యాయం చేస్తారా..?

ఏపీలో మిత్రపక్షం టీడీపీ ఏమి చేస్తుందన్నదే కీలకంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్‌ను గెలిపించటంలో భాగంగానే తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుండి టీడీపీ తప్పుకున్నది.

జనసేనకు చంద్రబాబు న్యాయం చేస్తారా..?
X

ఇప్పుడు ఇదే అంశంపై టీడీపీ, జనసేనలో చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షంగా జనసేన పోటీచేస్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది నియోజకవర్గాలను బీజేపీ కేటాయించింది. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, మధిరతో పాటు కోదాడ, కూకట్‌పల్లి, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయబోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నాగర్ కర్నూల్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సీమాంధ్రులు ఎక్కువగా ఉండేవే.

పైగా ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, మధిర, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలను కేటాయించటం. మిగిలిన కూకట్‌పల్లి, కోదాడలో కూడా సీమాంధ్రుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అంటే జనసేనను బీజేపీ సీమాంధ్ర పార్టీగానే చూస్తోందా లేకపోతే ఈ నియోజకవర్గాలను జనసేన కోరి తీసుకున్నదా అన్నది అర్థంకావటంలేదు. ఏదేమైనా సీమాంధ్ర నియోజకవర్గాలకే జనసేనను బీజేపీ పరిమితం చేసిందన్నది స్ఫ‌ష్ట‌మ‌వుతోంది.

ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఏపీలో మిత్రపక్షం టీడీపీ ఏమి చేస్తుందన్నదే కీలకంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్‌ను గెలిపించటంలో భాగంగానే తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుండి టీడీపీ తప్పుకున్నది. మరి ఏపీలో మిత్రపక్షం జనసేన తెలంగాణలో పోటీ చేస్తున్నపుడు ఓట్లేయించి గెలిపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపైన ఉంది కదా. పైగా జనసేన పోటీ చేస్తున్నది కూడా ఎక్కువగా సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలోనే. అందులోను కూకట్ పల్లి, ఖమ్మం, కొత్తగూడెం, మధిర, వైరా, కోదాడ నియోజకవర్గాలకు సీమాంధ్రతో సరిహద్దులున్నాయి.

ఇందులో కూడా ఖమ్మం, మధిర, కొత్తగూడెం, కోదాడ, వైరాతో పాటు గ్రేటర్ పరిధిలోని కూకట్ పల్లిలో కమ్మ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. మరి తమ సామాజివకవర్గం ఓట్లతో పాటు ఇతర ఓట్లను జనసేనకు వేయించి గెలిపిస్తేనే తర్వాత జరగబోయే ఏపీ ఎన్నికల్లో టీడీపీ మీద జనాలకు ముఖ్యంగా కాపులకు నమ్మకం ఏర్పడుతుంది. అలాకాకుండా పోటీచేసిన నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా జనసేన గెలవకపోతే తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి జనసేనకు న్యాయం చేస్తారా? చేయరా అన్నది చంద్రబాబు మీదే ఉంది. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

First Published:  7 Nov 2023 11:10 AM IST
Next Story