Telugu Global
Andhra Pradesh

బీసీలు జనసేనకు ఓట్లేస్తారా..?

జనసేన అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తారా..? లేకపోతే పవనే అవుతారా..? అనే సందేహం పెరిగిపోతోంది. ఈ విషయాన్ని పవన్ డైరెక్టుగా ఎక్కడా చెప్పలేదు.

బీసీలు జనసేనకు ఓట్లేస్తారా..?
X

జనసేన అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తారా..? ఇప్పుడిదే చర్చ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బీసీలకు రాజ్యాధికారం కావాలంటే బీసీ కులాల్లో ఐకమత్యం చాలా అవసరమన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. తమకు రాజ్యాధికారం అందించే పార్టీలకే ఏకపక్షంగా మద్దతుగా నిలబడితే పదేళ్ళల్లో బీసీలకు రాజ్యాధికారం కచ్చితంగా వస్తుందని పవన్ అన్నారు. బీసీల ఓట్లలో చీలికరాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీసీ నేతలపైనే ఉందన్నారు.

కులాన్ని అడ్డుపెట్టుకుని ఎదిగే నేతలను కాకుండా కులంకోసం పాటుపడే నేతలను ఎన్నుకోవాలని పిలుపిచ్చారు. జనసేన అధికారంలోకి రాగానే తూర్పుకాపుల సమస్యలన్నింటినీ ఒకే ఒక్క సంతకంతో తీర్చేస్తానని హామీ ఇచ్చారు. బీసీల సాధికారత కోసం పాటుపడే పార్టీ జనసేన మాత్రమే అన్నారు. ఒకవైపు బీసీలు ఐకమత్యంగా ఉంటే పదేళ్ళల్లో బీసీలకు రాజ్యాధికారం కచ్చితంగా వస్తుందని చెబుతూనే మరోవైపు బీసీలందరూ ఓట్లేసి జనసేనను గెలిపించాలని కోరటమే విచిత్రంగా ఉంది.

అంటే జనసేన అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తారా..? లేకపోతే పవనే అవుతారా..? అనే సందేహం పెరిగిపోతోంది. ఈ విషయాన్ని పవన్ డైరెక్టుగా ఎక్కడా చెప్పలేదు. పైగా బీసీలంతా జనసేనకే ఓట్లేయాలంటున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ కు ఎందుకు ఓట్లేయాలనే ప్రశ్న బీసీల్లోనే ఎప్పటినుండో ఉంది. చాలా ప్రాంతాల్లో ప్రత్యేకించి ఉభయగోదావరి జిల్లాల్లో బీసీ-కాపుల మధ్య పచ్చిగడ్డి వేయకుండానే భగ్గుమంటుందన్న విషయం తెలిసిందే. తనపై భరోసా ఉంచి జనసేనను గెలిపించాలన్నారు. అంటే జనసేన అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని పవన్ సంకేతాలిచ్చారు. బీసీలు జనసేనకు ఓట్లేస్తారని ఎలాగ అనుకున్నారో..?

ఓట్లు చీలకుండా బీసీలంతా జనసేనకు ఓట్లేస్తే సీఎం అయ్యేది పవనే కానీ, బీసీ నేత కాదు. మరింతోటిదానికి పదేళ్ళల్లో బీసీలకు రాజ్యాధికారం ఎలాసాధ్యమంటున్నారు. రాజ్యాధికారం అంటే మంత్రిపదవులు ఇవ్వటంకాదని ముఖ్యమంత్రి అవటమే అని పవన్ కు తెలీదా..? మంత్రి పదవులు ఇవ్వటమే బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినట్లు పవన్ అనుకుంటున్నారా..? ఇదే నిజమైతే గతంలో ఎప్పుడూ లేనంతమంది బీసీలు జగన్ మంత్రివర్గంలో ఉన్నారు. అలాగే ఎంపీలు, కార్పొరేషన్ పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకే ప్రాధాన్యతిచ్చారు. బీసీలకోసం జగన్ ఇంతచేస్తుంటే ఇక కొత్తగా పవన్ చేయబోయేదేమిటి..? బీసీల ఓట్లేమో జనసేనకు పడాలట, ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు తీసుకుంటారట. మరి పవన్ చెప్పే బీసీలకు రాజ్యాధికారం పదేళ్ళల్లో ఎలా సాధ్యమవుతుందో పవనే చెప్పాలి.

First Published:  27 Nov 2022 10:17 AM IST
Next Story