Telugu Global
Andhra Pradesh

మంత్రులకు శాఖల కేటాయింపు.. ఆలస్యమెందుకు?

పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు హోం శాఖ మంత్రి పదవి ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ జనసేనకు ఇచ్చే మంత్రి పదవులపై క్లారిటీ ఇస్తూ ఈనాడులో గురువారం ఓ వార్త వచ్చింది.

మంత్రులకు శాఖల కేటాయింపు.. ఆలస్యమెందుకు?
X

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఈనెల 12న చంద్రబాబు, 24 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. 24 మంది మంత్రుల్లో కేవలం ఏడుగురు మాత్రమే సీనియర్లు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 17 మంది కొత్తవారికి చంద్రబాబు కేబినెట్‌లో చోటిచ్చినట్లు తెలుస్తోంది. జనసేన నుంచి పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్‌కు మాత్రమే మంత్రివర్గంలో స్థానం దక్కింది.


ఐతే ప్రమాణస్వీకారం ముగిసి రెండు రోజులు గడిచింది. కానీ మంత్రుల శాఖలపై ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. మరోవైపు ఇవే శాఖలు ఆయా మంత్రులకు కేటాయించబోతున్నారంటూ మీడియాలో జోరుగా ప్రచారం కూడా నడుస్తోంది. కానీ, చంద్రబాబు మాత్రం ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. ప్రమాణస్వీకారం తర్వాత నేరుగా తిరుమలకు వెళ్లిన చంద్రబాబు.. శ్రీవారి దర్శనం తర్వాత తిరిగి విజయవాడకు చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు. దీంతో గురువారం మంత్రుల శాఖలపై క్లారిటీ వస్తుందని అంతా భావించారు. కానీ చంద్రబాబు ఆ సస్పెన్స్‌ను కంటిన్యూ చేశారు.


పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు హోం శాఖ మంత్రి పదవి ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ జనసేనకు ఇచ్చే మంత్రి పదవులపై క్లారిటీ ఇస్తూ ఈనాడులో గురువారం ఓ వార్త వచ్చింది. పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం హోదాతో పాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖ, అటవీ శాఖలు ఇవ్వబోతున్నట్లు చెప్పింది. పవన్‌కల్యాణ్ కోరిక మేరకే ఈ శాఖలు ఆయనకు కేటాయించబోతున్నట్లు వార్త రాసుకొచ్చింది. ఇక జనసేన మరో నేత నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయిస్తారని ప్రకటించింది. జనసేనకు దాదాపు ఇదే శాఖలు ఖరారు కావొచ్చు. కానీ ఇప్పటివరకూ అధికారికంగా శాఖలపై ప్రకటన రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళైన మంత్రులకు శాఖలు కేటాయిస్తారా, లేదా ఉత్కంఠ కనిపిస్తోంది.


ప్రమాణస్వీకారం తర్వాత కొత్త మంత్రులతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు వారికి కీలక సూచనలు చేశారు. మంత్రులకు స్వయంగా తానే సహాయకులను నియమిస్తానని చెప్పారు. అంతే కాదు.. కొత్తమంత్రులకు శిక్షణ కూడా ఇప్పిస్తానన్నారు. ఇక పాత మంత్రుల దగ్గర పని చేసిన వారిని తిరిగి నియమించుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు.

First Published:  14 Jun 2024 5:29 AM GMT
Next Story