తొందరేముంది.. చంద్రబాబు కేసును రేపు విచారిస్తాం : సీజేఐ ధర్మాసనం
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో రిమాండ్‌లో ఉన్నారని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్‌కు సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో తనపై సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టును కొట్టేయాలని ఏపీ హైకోర్టుకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ తిరస్కరణపై రివ్యూ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టును కోరారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో రిమాండ్‌లో ఉన్నారని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ దృష్టికి లాయర్ సిద్ధార్థ్ లూథ్రా తీసుకొని వెళ్లారు. ఏపీలో ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్నందున క్వాష్ రివ్యూ పిటిషన్‌పై విచారణ జరపాలని సీజేఐను అభ్యర్థించారు. అయితే ఇంత అత్యవసరంగా ఈ కేసును విచారించాల్సిన అవసరం ఏముందని సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు.
ఏపీలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, పైగా చంద్రబాబు ప్రస్తుతం రిమాండులో ఉన్నారని సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు. ఈ నెల 28 నుంచి సుప్రీంకోర్టుకు వరుసగా సెలవులు ఉన్న నేపథ్యంలో విచారణను అత్యవసరంగా చేపట్టాలని సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు.
చంద్రబాబు పిటిషన్‌ను మంగళవారం విచారిస్తామని సుప్రీం ధర్మాసనం చెప్పింది. మంగళవారం విచారణ మెన్షన్ లిస్ట్‌లో చేర్చాలని రిజిస్ట్రార్‌కు సూచించింది. రేపు కేసులో వాదనలు వింటామని.. ప్రస్తావన జాబితాలో మంగళవారం రావాలని చంద్రబాబు తరపు లాయర్‌కు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశించారు.