Telugu Global
Andhra Pradesh

పవన్‌ను జనాలు ఎందుకు నమ్మటం లేదు?

జనసేన 10వ ఆవిర్భావ సభ బందరులో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజాయితీగా రాజకీయాలు చేస్తున్న తనను ఎందుకు నమ్మటం లేదు? అబద్ధాలు చెప్పిన జగన్‌ను ఎందుకు నమ్ముతున్నారని జనాలను పవన్ డైరెక్టుగా అడిగారు.

పవన్‌ను జనాలు ఎందుకు నమ్మటం లేదు?
X

ఈ విషయమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. పవన్‌ను జనాలు నమ్మటం లేదని ఎవరో చెప్పటంకాదు. స్వయంగా పవనే చెప్పుకున్నారు. నీతి, నిజాయితీతో రాజకీయాలు చేస్తున్న తనను జనాలు ఎందుకు నమ్మటం లేదు అని బహిరంగ సభలో జనాలను పవనే వందసార్లు అడిగారు. దాంతోనే జనాలు పవన్‌ను నమ్మటం లేదనే విషయంపై అందరికీ క్లారిటి వచ్చింది. ఇక్కడే ‘అత్త తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు’ అన్న సామెత గుర్తుకొస్తోంది. దీనికి అర్థ‌మేమిటంటే పవన్ బాధంతా జనాలు తనను నమ్మనందుకు కాదు జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్నందుకు.

నిజాయితీగా రాజకీయాలు చేస్తున్న తనను ఎందుకు నమ్మటం లేదు? అబద్ధాలు చెప్పిన జగన్‌ను ఎందుకు నమ్ముతున్నారని జనాలను పవన్ డైరెక్టుగానే అడిగారు. జనసేన 10వ ఆవిర్భావ సభ బందరులో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో మద్యపాన నిషేధం సాధ్యంకాదని తాను చెబితే నమ్మకుండా మద్యనిషేధం చేస్తానని తప్పుడు హామీ ఇచ్చిన జగన్‌ను నమ్మారట. అలాగే ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడిన తనను జనాలు నమ్మలేదని బాధపడిపోయారు.

ఇదే సమయంలో తనకు అధికారం అప్పగిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన జగన్‌ను నమ్మారట. కాపులకు అండగా ఉంటానని చెప్పిన తనను నమ్మకుండా కాపులు తనకు అవసరంలేదని చెప్పిన జగన్‌కే కాపులంతా ఎందుకు ఓట్లేశారని నిలదీశారు. పోయిన ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ కావాలని అడిగినప్పుడు కాపుల ఓట్లు తనకు అవసరమే లేదని నిర్మోహమాటంగా చెప్పినా మళ్ళీ జగన్‌కే ఎందుకు ఓట్లేశారని అడిగారు.

జగన్ అత్యంత అవినీతిపరుడు, దోపిడీదారుడు, తప్పుడు హామీలిచ్చేవాడని చెప్పిన పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సమర్ధుడని సర్టిపికెట్‌ ఇచ్చేశారు. చంద్రబాబు సమర్ధత విషయంలో కానీ 2019 ఎన్నికల్లో జగన్‌ను జనాలు ఎందుకు నమ్మారు, తనను ఎందుకు నమ్మలేదనే విషయాన్ని పవన్ నిజాయితీతో విశ్లేషించుకుంటే సమాధానం దొరుకుతుంది. దీనికి ప్రత్యేకించి లై డిటెక్టర్, పాలిగ్రాఫ్ టెస్ట్, నిజనిర్ధారణ కమిటీ అవసరం లేదు. కాస్త నిజాయితీ ఉంటే చాలు సమాధానం పవన్‌కే తెలిసిపోతుంది.

First Published:  15 March 2023 11:37 AM IST
Next Story