బాలినేనిని ఎందుకు భరిస్తున్నారు?
ప్రతి చిన్న విషయానికి అలగటం, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవటం, పంచాయితీలు పెట్టుకోవటం చివరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర పంచాయితీ జరగటం చాలా మామూలైపోయింది.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ప్రకాశం జిల్లాలో పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. ప్రతి చిన్న విషయానికి అలగటం, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవటం, పంచాయితీలు పెట్టుకోవటం చివరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర పంచాయితీ జరగటం చాలా మామూలైపోయింది. జగన్ తనకు బంధువని, తాను జగన్‌కు అత్యంత సన్నిహితుడనని హైలైట్ అయ్యేందుకే బాలినేని ఇవన్నీ చేస్తున్నట్లు పార్టీలోనే బాగా ప్రచారంలో ఉంది. పార్టీకి బాలినేని పెద్ద తలనొప్పగా తయారైనట్లు చాలామంది అభిప్రాయపడుతున్నారు.
పార్టీకి తలనొప్పిగా తయారైన బాలినేనిని ఇంకా జగన్ ఎందుకు భరిస్తున్నారో అర్థంకావటంలేదు. తాను కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసినప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేసి బాలినేని తనకు మద్దతుగా నిలిచారన్న ఏకైక కారణంతోనే బాలినేనిని జగన్ భరిస్తున్నారు. దాన్ని ఈ మాజీ మంత్రి బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరు, పార్టీలో ఇచ్చిన సమన్వయకర్త బాధ్యతలను సక్రమంగా నెరవేర్చరు. పార్టీలో పదవులిస్తే తీసుకుంటారు కానీ వాటికి న్యాయం చేయరు.
బావ వైవీ సుబ్బారెడ్డిని ఎలా దెబ్బకొట్టాలన్న ఆలోచన తప్ప ఇంకే టార్గెట్ ఉండదు బాలినేనికి. వైవీని దెబ్బకొడితే పార్టీ కూడా నష్టపోతుందన్న కనీస ఇంగితం కూడా మాజీ మంత్రికి లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఎంత కీలకమో వైసీపీకీ అంతే కీలకమని తెలిసి కూడా బాలినేని తన పద్ధతి మార్చుకోవటంలేదు. జగన్ దగ్గర పంచాయితి జరిగిన ప్రతిసారి ఇక నుండి పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేస్తానని చెప్పటం మళ్ళీ కొద్దిరోజులకే ఏదో విషయంలో అలిగి కంపు చేయటం అలవాటైపోయింది.
ఒంగోలు భూ కుంభకోణంలో తన మద్దతుదారులపై కేసులు నమోదుచేసిన పోలీసులు తాను చెప్పినా వైవీ మద్దతుదారులపై మాత్రం కేసులు పెట్టలేదని అలగటమే ఆశ్చర్యంగా ఉంది. సాక్ష్యాలు లేకుండా కేసులు ఎలా పెడతామని పోలీసులు అడిగినందుకే బాలినేని ప్రభుత్వం మీద అలిగారు. ఇప్పుడు ఆ పంచాయితీయే జగన్ ముందుకొచ్చింది. ఇప్పటికైనా బాలినేని అలక వీడుతారా? లేకపోతే బాలినేని విషయంలో జగనే ఏదో ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాలి.
♦