Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు ఎందుకింత మంట..?

ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం జప్తు చేస్తే చంద్రబాబు ఎందుకింత మండిపడుతున్నారో అర్థం కావటంలేదు. తనదికాని అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం జప్తుచేస్తుంటే చంద్రబాబుకు అభ్యంతరం ఏమిటి..?

చంద్రబాబుకు ఎందుకింత మంట..?
X

కరకట్ట అక్ర‌మ నివాసంపై చంద్రబాబు నాయుడు మొదటిసారి నోరిప్పారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి రోడ్డు షోలో మాట్లాడుతూ కరకట్టమీద తాను లింగమనేని రమేష్ భవనంలో అద్దెకు ఉంటున్నట్లు చెప్పారు. ఆ భవనంలో తాను ఉంటున్నందుకు అద్దె కూడా చెల్లిస్తున్నట్లు చెప్పారు. అద్దె చెల్లించి అందులో ఉంటున్నప్పుడు ఆ ఇల్లు తనది ఎలా అవుతుందని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. క్విడ్ ప్రోకోలో భాగంగా తాను లింగమనేని నుంచి ఆ ఇంటిని సొంతం చేసుకున్నానని ప్రభుత్వం చెప్పటం అన్యాయమన్నారు. ఆ ఇంటిని జప్తు చేయటం ఏమిటంటూ మండిపోయారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే కరకట్ట మీద నిర్మించిన భవనాలు అక్రమ నిర్మాణాలని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. వాటిని కూల్చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం నోటీసులు కూడా అంటించింది. ఈ తంతుని అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమ దగ్గరుండి మరీ జరిపించారు. సరే తర్వాత పరిణామాల్లో లింగమనేని గెస్ట్ హౌస్ లోకే చంద్రబాబు దిగారు. అంతమాత్రాన అక్రమ నిర్మాణం సక్రమ నిర్మాణమైపోదు.

ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం జప్తు చేస్తే చంద్రబాబు ఎందుకింత మండిపడుతున్నారో అర్థం కావటంలేదు. తనదికాని అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం జప్తుచేస్తుంటే చంద్రబాబుకు అభ్యంతరం ఏమిటి..? క్విడ్ ప్రోకోనా.. కాదా.. అన్నది విచారణలో తేలుతుంది.


ఈలోగా అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటంలో తప్పులేదు కదా. భవనాన్ని జప్తుచేస్తున్నందుకు లింగమనేని అభ్యంతరం చెప్పాలి కానీ చంద్రబాబు చెప్పటం ఏమిటి..? అసలు లింగమనేని ఎందుకు మాట్లాడటంలేదు..? ఇక్కడొక విచిత్రం ఏమిటంటే.. లింగమనేని ఇంట్లో చంద్రబాబు అద్దెకుంటున్నట్లు చెప్పిన ధూళిపాళ్ళ నరేంద్ర.. ఆ భవనంలో ఉండేందుకు అనుమతించాలని చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు.

ఇక్కడే ధూళిపాళ్ళ, చంద్రబాబు మాటల మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజంగా భవనం లింగమనేనిదే అయితే అందులో ఉండేందుకు ప్రభుత్వం అనుమతి ఎందుకు..? భవనం యజమాని ఎవరైతే అనుమతించాల్సింది వాళ్ళే కదా.


అందులో ఉండేందుకు అనుమతించాలని చంద్రబాబు ప్రభుత్వానికి లేఖలు రాశారంటేనే దాని యజమాని ప్రభుత్వమే అని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లయ్యింది. పైగా అధికారంలో ఉన్నప్పుడు లింగమనేని భవనం ప్రభుత్వ భవనం అని చెప్పిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే ప్రైవేటుభవనం అని బుకాయించటమే విచిత్రంగా ఉంది.

First Published:  18 May 2023 11:10 AM IST
Next Story