Telugu Global
Andhra Pradesh

రమణగారూ.. త‌మ‌రికిది తగునా..?

ఇంగ్లీష్‌కు ఉపాధితో సంబంధం ఉంది. ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకున్నవారితో తెలుగు మీడియంలో చ‌దివిన‌వారు పోటీ పడడం కష్టసాధ్యమనే విషయం చాలా మంది అనుభవంలోకి వచ్చిందే.

రమణగారూ.. త‌మ‌రికిది తగునా..?
X

జస్టిస్‌ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి చాలా కాలం క్రితమే పదవీ విరమణ చేశారు. రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం (ఎస్టీయూ) ఏర్పాటు చేసిన సభలో ఆయన ఓ ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగంలోని ఒక ముఖ్యమైన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఇంగ్లీష్‌ మీడియం మంచిదనే భ్రమలు వద్దని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయన ఆ వ్యాఖ్య చేశారని అనుకోవచ్చు. ఒకవేళ ఆయన జగన్‌ ప్రభుత్వం విద్యావిధానంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను గమనించారో, లేదో తెలియదు గానీ, ఇంగ్లీష్‌ మాధ్యమంపై ఈ విధమైన ప్రకటన చేశారు.

మాతృభాష లేదా మన వరకు వస్తే తెలుగు భాష పరిరక్షణకు, పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడానికి మధ్య పొంతన లేదనే విషయాన్ని కొంతమంది గుర్తించడం లేదు. కేవలం పాఠశాలల్లో తెలుగు మీడియం ఉన్నంత మాత్రాన భాష బతికిపోతుందని అనుకుంటే పొరపాటే. ఆంగ్ల మాధ్యమంలో ప్రావీణ్యం పొందడమే కాకుండా ఆ భాషలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంచుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగాలకు పోటీ పడవచ్చుననే విషయాన్ని స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియాన్ని వ్యతిరేకించేవారు గమనించడం లేదు.

భాషకు ఉపాధితో సంబంధం ఉండాలని, అప్పుడే భాష విస్తరిస్తుందని తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌ ఎన్‌. గోపి ఓ చోట రాశారు. ఇంగ్లీష్‌కు ఉపాధితో సంబంధం ఉంది. ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకున్నవారితో తెలుగు మీడియంలో చ‌దివిన‌వారు పోటీ పడడం కష్టసాధ్యమనే విషయం చాలా మంది అనుభవంలోకి వచ్చిందే. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. ప్రపంచీకరణ నేపథ్యంలో కార్పోరేట్‌ సంస్థలు పెద్ద ఎత్తున తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. కార్పోరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే ఇంగ్లీష్‌లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తప్పనిసరి. ఇంగీష్‌లో మాట్లాడలేక ఉద్యోగాలు కోల్పోయేవాళ్లు కూడా ఉన్నారు.

మారిన పరిస్థితుల నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచే సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. దళితుల పిల్లలు, పేదల పిల్లలు ఈ పాఠశాలల్లో చదివి, కార్పోరేట్‌ స్కూళ్లలో చదివినవారితో పోటీ పడగలుగుతారు. ఇది సమాజం ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పేద కుటుంబాలు ఆర్థికంగా పుంజుకోవడానికి పనికొస్తుంది. దానివల్ల కొన్ని దశాబ్దాలు గడిచేసరికి సంక్షేమ పథకాల అవసరం తీరిపోతుంది. ఇంత ముందుచూపుతో జగన్‌ ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తూ, పిల్లల్లో ఆంగ్ల ప్రావీణ్యాన్ని పెంచే చర్యలకు నడుం బిగించారు. ఈ విషయాన్ని రమణలాంటి వాళ్లు గుర్తించాల్సి ఉంటుంది.

ఇంకో విషయం, ప్రధానమైంది ఏమిటంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం వద్దనేవాళ్లు ప్రైవేట్‌ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం వద్దని, తెలుగు మీడియం మాత్రమే ఉండాలని ఎందుకు అడగరనేది ప్రశ్న. ప్రైవేట్‌ స్కూళ్లలో తెలుగు మీడియం ప్రవేశపెట్టేలా ప్రభుత్వాలపై ఒత్తిడి ఎందుకు చేయరనేది మరో ప్రశ్న.

ఇంటర్నేషనల్‌ స్కూళ్లు రంగంలోకి దిగిన నేపథ్యంలో ప్రైవేట్‌ స్కూళ్లను ఫీజులు, తదితర విషయాల్లో అదుపు చేయడం కూడా సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది. సంపన్నులు, ఆధిపత్య కులాలకు చెందినవారి పిల్లలు ప్రైవేట్‌ స్కూళ్లలో చదువుతుంటే, పేద పిల్లలకు మాత్రమే తెలుగు మీడియం ఉండాలనే వాదనను ముందుకు తీసుకు రావడంలో అర్థం లేదు. ప్రైవేట్‌ స్కూళ్లలో లక్షలాది రూపాయలు పెట్టి చేర్పించలేని కుటుంబాలు చాలానే ఉన్నాయి. కేవలం పేదరికం కారణంగా అది జరుగుతుంది. అటువంటి వారికి కార్పోరేట్‌ స్కూళ్ల స్థాయిలో విద్యను అందించడం తప్పెలా అవుతుందనేది ప్రధానమైన ప్రశ్న. తెలుగు భాషను కాపాడడానికి కేవలం పేదలు మాత్రమే పనిముట్లు కావాలా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.

తెలుగు భాషను కాపాడడానికి ఇతరేతర మార్గాలు చాలానే ఉంటాయి. వాటి గురించి ఆలోచిస్తే మంచిది. సమాజంలోని పేదలంతా తెలుగును కాపాడే బాధ్యతను మోయాల్సిన అవసరం ఏముంది? పేదరికం నుంచి బయటపడడానికి ఇంగ్లీష్‌ మీడియం వాహకంగా పనిచేస్తుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో జగన్‌ ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెట్టడాన్ని అందరూ ఆహ్వానించాల్సి ఉంటుంది.

First Published:  1 Feb 2024 5:30 PM IST
Next Story