చంద్రబాబు ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు..?
చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తన హయాంలో ఏమి చేసింది చెప్పకుండా జగన్ను టార్గెట్ చేయటమే పనిగా పెట్టుకున్నారు. సభలో గంటసేపు మాట్లాడితే 50 నిమిషాలు జగన్ను తిట్టడానికే సరిపోతోంది.
ఎన్నికల్లో పోటీచేస్తున్న ఎవరైనా తమకు ఓట్లేయమని అడగటం చాలా సహజం. తమకే ఎందుకు ఓట్లేయాలి..? తమనెందుకు గెలిపించాలనే విషయాన్ని ఓటర్లకు వివరిస్తారు. పనిలో పనిగా ప్రత్యర్థులకు ఎందుకు ఓట్లేయకూడడో వివరిస్తారు. అయితే తనకు ఎందుకు ఓట్లేయాలో చెప్పకుండా ప్రత్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించాలని మాత్రమే ప్రచారం చేయటాన్ని ఏమంటారు..? ప్రచారంచేసిన ప్రతిచోటా పాడినపాటే పదేపదే పాడుతుంటే జనాలు ఓట్లేస్తారా..?
ఇప్పుడు చంద్రబాబునాయుడు వ్యవహారం ఇలాగే ఉంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డేమో తనకు ఎందుకు ఓట్లేయాలో వివరించి చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో తాను ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలను 98 శాతం అమలుచేసినట్లు చెప్పుకుంటున్నారు. తాను చేసిన అభివృద్ధిని, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను జనాలకు జగన్ వివరించి చెబుతున్నారు. ప్రతిపక్షాలను గెలిపిస్తే జరగబోయే అనర్ధాలు ఏమిటో వివరిస్తున్నారు. జగన్ వాదనతో జనాలు ఏకీభవిస్తారా లేదా అన్నది తర్వాత సంగతి. జగన్ ఇంతటితో ఆగకుండా తన పాలనలో ఇంట్లో వాళ్ళకి మంచిజరిగిందని అనిపిస్తేనే తనకు ఓట్లేయమని ప్రతి సభలోనూ డైరక్టుగానే చెబుతున్నారు.
సీన్ కట్ చేస్తే.. చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తన హయాంలో ఏమి చేసింది చెప్పకుండా జగన్ను టార్గెట్ చేయటమే పనిగా పెట్టుకున్నారు. సభలో గంటసేపు మాట్లాడితే 50 నిమిషాలు జగన్ను తిట్టడానికే సరిపోతోంది. తన హయాంలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలను చూసి ఓట్లేయమని ఎక్కడా అడగటంలేదు. అసలు తన పాలన గురించి జనాలకు చంద్రబాబు ఒక్కసారి కూడా గుర్తుచేయటంలేదు.
జగన్ చెబుతున్నట్లుగా తన పాలనలో మంచి జరిగిందని అనుకుంటేనే ఓట్లేయమని చంద్రబాబు ఎందుకు అడగలేకపోతున్నారు..? తన హయాంలో జరిగిన అభివృద్ధిని ఎందుకు వివరించి చెప్పటంలేదు. ఎంతసేపు జగన్ అవినీతిపరుడని, జగన్ సైకో అని, జగన్ శాడిస్టని, జగన్ ఫ్యాక్షనిస్టనే గోలచేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులపాల్జేశాడని, రాష్ట్రాభివృద్ధిని నాశనం చేశాడని మాత్రమే రెచ్చిపోతున్నారు. బహిరంగసభల్లో ఇన్నిమాటలు మాట్లాడుతున్న చంద్రబాబు తనకు ఎందుకు ఓట్లేయాలో చెప్పకుండా జగన్ కు ఓట్లేయద్దని, చిత్తుచిత్తుగా ఓడించండని మాత్రమే గొంతుచించుకుంటున్నారు. చంద్రబాబు ఈ వైఖరే జనాలకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి చివరకు ఏమిచేస్తారో చూడాలి.