పొత్తంటే రాయలసీమ తమ్ముళ్ళెందుకు భయపడుతున్నారు..?
గడచిన రెండు ఎన్నికల్లో గెలిచిన ముస్లిం మైనారిటీ నేతలంతా వైసీపీ వాళ్ళే. కడప, విజయవాడ పశ్చిమ, కర్నూలు, మదనపల్లి, గుంటూరు నియోజకవర్గాల్లో వైసీపీనే గెలిచింది.
రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని తమ్ముళ్ళు చంద్రబాబుతో గట్టిగా చెబుతున్నారు. బీజేపీతో పొత్తు విషయంలో పార్టీలోని సీనియర్ల నుంచి అభిప్రాయసేకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పొత్తు వద్దంటే వద్దంటున్నారు. బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి నష్టమే కాని ఎలాంటి లాభం ఉండదని తమ్ముళ్ళు స్పష్టంగా చెప్పారని సమాచారం. అసలు టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకుంటే తమ్ముళ్ళకి వచ్చే నష్టం ఏమిటి..?
నష్టం ఏమిటంటే.. చాలా ఉంటుందని తమ్ముళ్ళు భయపడుతున్నారు. రాయలసీమలో ముస్లిం మైనారిటీల ఓట్లు కీలకంగా ఉన్న నియోజకవర్గాలు సుమారు 22 ఉన్నాయి. వీటిల్లో కడప, కర్నూలు, అనతపురం జిల్లాల్లో ఎక్కువ నియోజకవర్గాలున్నాయి. బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం మైనారిటీ ఓట్లన్నీ టీడీపీ, జనసేనకు దూరమవుతాయని సీమలోని తమ్ముళ్ళు బాగా భయపడుతున్నారు. వాస్తవానికి ముస్లిం మైనారిటీలు టీడీపీకి దూరమై చాలా కాలమైపోయింది. గడచిన రెండు ఎన్నికల్లో టీడీపీ తరఫున ఒక్క ముస్లిం మైనారిటీ నేత కూడా గెలవలేదు.
గడచిన రెండు ఎన్నికల్లో గెలిచిన ముస్లిం మైనారిటీ నేతలంతా వైసీపీ వాళ్ళే. కడప, విజయవాడ పశ్చిమ, కర్నూలు, మదనపల్లి, గుంటూరు నియోజకవర్గాల్లో వైసీపీనే గెలిచింది. అయితే రాబోయే ఎన్నికల్లో ముస్లింలు టీడీపీ+జనసేనకు మద్దతుగా నిలబడతారని చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళు అనుకుంటున్నారు. ఈ సమయంలో సడన్ గా బీజేపీతో పొత్తంటే మళ్ళీ ముస్లింలు టీడీపీకి దూరమై వైసీపీకే ఓట్లేస్తారనే భయం తమ్ముళ్ళల్లో పెరిగిపోతోంది. అందుకనే పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని పీలేరు, మదనపల్లి, వాయల్పాడు, తిరుపతి నియోజకవర్గాల్లో ముస్లింల సంఖ్య బాగానే ఉంది.
ఇక కడప జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, కమలాపురంలో ముస్లిం మైనారిటీలు బాగున్నారు. కర్నూలు జిల్లాలోని కర్నూలు, ఆళ్ళగడ్డ, ఆదోని, నంద్యాల, బనగానపల్లి, శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ముస్లింఓట్లు ఎక్కువున్నాయి. ఆళ్ళగడ్డ, కర్నూలు, నంద్యాలలో అయితే వీళ్ళే గెలుపోటముల నిర్ణయాత్మక శక్తి. అలాగే అనంతపురం జిల్లాలోని హిందుపురం, కదిరి, అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, గుంతకల్, పెనుకొండ నియోజకవర్గాల్లో ముస్లింలు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు. బీజేపీతో పొత్తు కారణంగా పై నియోజకవర్గాలను డైరెక్టుగా వైసీపీకి రాసిచ్చేసినట్లే అని మొత్తుకుంటున్నారు. దీని ప్రభావం లోక్ సభ స్థానాలపైన కూడా పడుతుందని చెబుతున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.