"వై ఏపీ నీడ్స్ జగన్..?" వైసీపీ కొత్త కార్యక్రమం
టికెట్లు రానంత మాత్రాన సిట్టింగ్ లు బాధపడొద్దని ముందుగానే హింటిచ్చారు సీఎం జగన్. జుట్టు ఉంటే ఏ ముడైనా వేసుకోవచ్చని, ముందు పార్టీ గెలుపుకోసం అందరూ కృషి చేయాలని చెప్పారు.
సమయం లేదు మిత్రమా.. అంటూ సమర శంఖం పూరించారు సీఎం జగన్. తాడేపల్లిలో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ చార్జ్ లు, కోఆర్డినేటర్లకు హితబోధ చేసారు. ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు, రాబోయే 6 నెలలు మరో ఎత్తు అని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎలా పనిచేస్తామన్నదే ముఖ్యం అన్నారు. గేర్ మార్చాల్సిన సమయం వచ్చిందని తేల్చి చెప్పారు జగన్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పార్టీపై సానుకూల పరిస్థితి ఉన్నట్టు తేలిపోయిందని, అందుకే ప్రతిపక్షాలన్నీ కట్టగట్టుకుని వస్తున్నాయని చెప్పారు జగన్.
ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి?
ఇప్పటికే ప్రకటించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతోపాటు, ఎన్నికల ఏడాదిలో "వై ఏపీ నీడ్స్ జగన్..?" అనే కొత్త కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నట్టు నేతలకు తెలిపారు సీఎం జగన్. ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే రావాలని, రాకపోతే ఏమవుతుంది, వస్తే ఏమవుతుంది అనే విషయాలను ప్రజలకు వివరించేదే ఈ కార్యక్రమం అన్నారు. జగనన్న సురక్ష విజయవంతమైనట్టే, జగనన్న ఆరోగ్య సురక్ష కూడా విజయవంతం చేయాలని, దీని ద్వారా ప్రభుత్వంపై సానుకూలత పెరుగుతుందన్నారు. ప్రభుత్వం తమ వద్దకే వచ్చిందన్న పాజిటివ్ దృక్పథం ప్రజల్లో వస్తుందని చెప్పారు జగన్.
కొంతమందికి టికెట్లు రాకపోవచ్చు..
టికెట్లు రానంత మాత్రాన సిట్టింగ్ లు బాధపడొద్దని ముందుగానే హింటిచ్చారు సీఎం జగన్. ఇప్పటికే ఇన్ చార్జ్ లుగా ఉన్నవారి స్థానాల్లో కూడా మార్పులు ఉంటాయన్నారు. జుట్టు ఉంటే ఏ ముడైనా వేసుకోవచ్చని, ముందు పార్టీ గెలుపుకోసం అందరూ కృషి చేయాలని చెప్పారు. టిక్కెట్లు ఇవ్వనంత మాత్రాన వాళ్లు నా వాళ్లు కాకుండాపోరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. టిక్కెట్ల కేటాయింపులో ప్రతి ఒక్కరూ తన నిర్ణయాలను పెద్ద మనసుతో స్వాగతించాలన్నారు. లీడర్ మీద, పార్టీ మీద నమ్మకం ఉంచాలన్నారు. సర్వేలు కూడా తుది దశలోకి వస్తున్నాయని, ఎంత ఎక్కువ ప్రజల్లో ఉంటే.. అంత మంచి ఫలితాలు మీ పట్ల వస్తాయని, వాటి ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారు.