జనసేన మీద ఇంత నమ్మకమా..?
పవన్ కల్యాణ్ బహిరంగ సభలకు, రోడ్డు షోలు, ర్యాలీలకు జనాలు విరగబడి వస్తారు. కానీ, ఓట్లు మాత్రం ఇతర పార్టీలకు వేస్తారని మరోసారి రుజువైంది. ఈ విషయాన్ని చాలాకాలంగా పవనే స్వయంగా చెప్పి మొత్తుకుంటున్నారు.
మిత్రపక్షం జనసేన మీద ఏపీ బీజేపీ నేతలకు చాలా నమ్మకమే ఉన్నట్లుంది. రాబోయే ఎన్నికల్లో జనసేన+బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధనరెడ్డి చెప్పారు. తెలంగాణలో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత కూడా జనసేన మీద విష్ణుకి ఇంత నమ్మకం ఉందంటే గొప్పనే చెప్పాలి. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగానే ఎన్నికలకు వెళ్లాయి. జనసేన 8 నియోజకవర్గాల్లో పోటీచేస్తే బీజేపీ 111 నియోజకవర్గాల్లో పోటీచేసింది.
జనసేన అభ్యర్థుల్లో ఎవరికీ డిపాజిట్లు కూడా దక్కలేదు. వీళ్లు నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్) కన్నా కాస్త ఎక్కువ ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. ఇక బీజేపీ మాత్రం ఎనిమిది నియోజకవర్గాల్లో గెలిచింది. సుమారు 15 నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ ఓట్లనే తెచ్చుకుంది. దాంతో ఏపీ బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. తెలంగాణలో జనసేన వల్ల బీజేపీకి ఏమి లాభం జరిగిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ, జనసేనకు జనాల్లో ఉన్న సీనేంటో అర్థమైపోయింది.
ఎందుకంటే.. పవన్ కల్యాణ్ బహిరంగ సభలకు, రోడ్డు షోలు, ర్యాలీలకు జనాలు విరగబడి వస్తారు. కానీ, ఓట్లు మాత్రం ఇతర పార్టీలకు వేస్తారని మరోసారి రుజువైంది. ఈ విషయాన్ని చాలాకాలంగా పవనే స్వయంగా చెప్పి మొత్తుకుంటున్నారు. తన సభలకు వచ్చి సీఎం.. సీఎం.. అని అరవటం కాదని, ఓట్లేయమని బతిమలాడుకుంటున్నారు. అయినా జనాలు ఓట్లేయటంలేదు. ఈ పరిస్థితుల్లో జనసేన, బీజేపీ ఎన్నికలకు వెళితే మంచి ఫలితాలు ఎలా వస్తాయో విష్ణే చెప్పాలి. ఏపీలో జనసేనకు అయినా ఎన్నోకొన్ని ఓట్లున్నాయి. బీజేపీకి అయితే అసలు ఓట్లే లేవు. పోయిన ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ.
బీజేపీలో చాలామంది నేతలు పేపర్ టైగర్లే కానీ, ఎన్నికల్లో పోటీచేసి గెలిచేంత సత్తా ఉన్నవాళ్ళలో ఎవరూ లేరు. విష్ణు కూడా అలాంటి బాపతే అనటంలో సందేహంలేదు. అందుకనే నమ్ముకున్న పవన్ తమను ఎక్కడ వదిలేస్తారో అనే భయం పెరిగిపోతున్నట్లుంది. ఇక్కడ వీళ్ళు గ్రహించాల్సింది ఏమిటంటే.. పవన్ బీజేపీని ఎప్పుడో వదిలేశారు. ఇంకా బీజేపీయే పవన్‌ను పట్టుకుని వేలాడుతోంది.