Telugu Global
Andhra Pradesh

ఇంతకీ ఎంపీ అసలు టార్గెట్ ఎవరు..?

ఎంపీ టికెట్ అంటే డైరెక్టుగా తన తమ్ముడికి ఇవ్వద్దని చెప్పారు బాగానే ఉంది. మరి ఆ ముగ్గురికి కూడా టికెట్లు ఇవ్వకూడదంటే అర్ధమేంటి..? ఎంపీ చెప్పిన ఆ ముగ్గురు ఎవరసలు..?

ఇంతకీ ఎంపీ అసలు టార్గెట్ ఎవరు..?
X

టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఏకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకే సూచనతో కూడిన వార్నింగ్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా తన తమ్ముడు కేశినేని చిన్నీకి టికెట్ ఇస్తే తాను అంగీకరించనని, సహకరించనని తేల్చిచెప్పేశారు. పనిలో పనిగా ఆ ముగ్గురికి కూడా టికెట్లు ఇస్తే ఏ రూపంలో కూడా సహకరించేది లేదని చెప్పారు.

ఎంపీ టికెట్ అంటే డైరెక్టుగా తన తమ్ముడికి ఇవ్వద్దని చెప్పారు బాగానే ఉంది. మరి ఆ ముగ్గురికి కూడా టికెట్లు ఇవ్వకూడదంటే అర్ధమేంటి..? ఎంపీ చెప్పిన ఆ ముగ్గురు ఎవరసలు..? పైగా కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ మోసాలు చేసిన వారు, కాల్ మనీ సెక్స్ కుంభకోణం సూత్రదారులు, పేకాటక్లబ్బులు నడిపేవారికి టికెట్లిస్తారా అంటూ చంద్రబాబునే నిలదీశారు. దావూద్ ఇబ్రహీం కూడా టికెట్ ఇచ్చేస్తారా అంటూ ఘాటుగా వేసిన ప్రశ్న పార్టీలో సంచలనంగా మారింది.

ఇక్కడే ఎంపీ అసలు టార్గెట్ ఎవరు అనే విషయమై చర్చలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ గమనించాల్సిందేమంటే.. ఎంపీకి కొందరు నేతలకు ఏమాత్రం పడటంలేదు. ఎంపీకి వ్యతిరేకంగా మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, మాజీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, సీనియర్ నేత నాగూల్ మీరా గట్టిగా నిలబడ్డారు. వీరిలో కూడా దేవినేనికి మిగిలిన ముగ్గురికి బాగా గ్యాపుంది. అంటే ఈ నలుగురిలో కూడా రెండు గ్రూపులన్నమాట.

ఇక్కడే ఎంపీ చెప్పిన ఆ ముగ్గురు ఎవరు అన్నది సస్పెన్సుగా మారింది. ఈ నలుగురిలో మీరాకు పోటీచేసే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. దేవినేని, బోండా, బుద్ధా వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. బోండా విజయవాడ సెంట్రల్, బుద్ధా విజయవాడ వెస్ట్ టికెట్ అడుగుతుంటే దేవినేని నియోజకవర్గం ఫైనల్ కాలేదు. కాబట్టి ఎంపీ టార్గెట్ అంతా దేవినేని, బోండా, బుద్ధాలపైనే ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి తన ఆరోపణలపై ఎంపీనే కాస్త క్లారిటి ఇస్తే బాగుండేది.

First Published:  16 Jan 2023 12:08 PM IST
Next Story