పోలవరంపై శ్వేతపత్రం.. జగన్ పై సీఎం ఘాటు వ్యాఖ్యలు
పోలవరం మరమ్మతుల కోసం అమెరికా, కెనడా నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. వాళ్లు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారని వివరించారు.
ఆమధ్య పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించి గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు. తాజాగా శ్వేతపత్రం విడుదల చేసి మరోసారి జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరానికి జగన్ ఓ శాపంలా మారారని, క్షమించరాని నేరం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు బాబు. పోలవరం ధ్వంసం జాతికి జరిగిన విద్రోహం అని అభివర్ణించారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ హయాంలో జరిగిన నష్టమే ఎక్కువ అని అన్నారు. జగన్ మూర్ఖత్వం వల్లే ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని అన్నారు సీఎం చంద్రబాబు.
ఎవరి హయాంలో ఎంత పని జరిగిందో చెప్తూ, పోలవరం ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్.#PolavaramProject #NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/QosQ1GTMBH
— Telugu Desam Party (@JaiTDP) June 28, 2024
పోలవరం లెక్కలు..
2014-19 మధ్య పోలవరం ప్రాజెక్ట్ కోసం తమ ప్రభుత్వం రూ.11,762 కోట్లు ఖర్చు చేసిందని, వైసీపీ హయాంలో కేవలం రూ.4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని శ్వేతపత్రంలో లెక్కలు చూపించారు. టీడీపీ హయాంలో 72శాతం పనులు పూర్తయితే గత ఐదేళ్లలో 3.84శాతం పనులే జరిగాయని, రూ.3,385 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ అసమర్థతతో రూ.80 కోట్లతో నిర్మించిన గైడ్‌బండ్ కుంగిపోయి నిరుపయోగంగా మారిందన్నారు. పోలవరం నిర్మాణ ఏజెన్సీని మార్చకపోయి ఉంటే 2020 నాటికే ప్రాజెక్టు పూర్తయ్యేదని, వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రూ.4,900 కోట్ల నష్టం జరిగిందని అన్నారు ప్రాజెక్ట్ ఖర్చు 38 శాతం పెరిగిందన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోల్పోవడం వల్ల రూ.3 వేల కోట్లు నష్టపోయామని, పోలవరం ఆలస్యంతో రైతులకు రూ.45 వేల కోట్ల నష్టం జరిగిందని శ్వేతపత్రంలో వివరించారు.
దిద్దుబాటు..
పోలవరం మరమ్మతుల కోసం అమెరికా, కెనడా నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. వాళ్లు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారని వివరించారు. పోలవరంపై ఇప్పుడు మొదటి శ్వేతపత్రం విడుదల చేశామని, సాగునీటి ప్రాజెక్ట్ లపై రెండో శ్వేత పత్రం విడుదలవుతుందని చెప్పారు. మొత్తంగా 7 శ్వేత పత్రాలు సిద్ధం చేసి, గత ప్రభుత్వ నిర్లక్ష్యాలను, అవినీతిని బయటపెడతామన్నారు. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలని, 25 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు సీఎం చంద్రబాబు.