రఘురామకృష్ణంరాజుకు దారేది..?
త్వరలోనే రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ దిశగా చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం.
బీజేపీ నుంచి ఎంపీ టికెట్ దక్కుతుందనుకున్న రఘురామకృష్ణంరాజు ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పుడు ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. డిమాండ్ చేసే పరిస్థితి నుంచి సీటు కోసం తన పేరు పరిశీలించాలని అడుక్కునే పరిస్థితికి వచ్చారు రఘురామకృష్ణంరాజు. ఇన్నాళ్లూ తను ఆశలు పెట్టుకున్న ఏ పార్టీ ఆయనను ఆదరించలేదు. చివరకు ఇప్పుడు ఆయన టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.
త్వరలోనే రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ దిశగా చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. విజయనగరం ఎంపీ సీటు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబును రఘురామకృష్ణంరాజు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో క్షత్రియ సామాజికవర్గం ఓట్లు గణనీయంగా ఉండడమే ఇందుకు కారణం. అయితే స్థానిక నేతలు రఘురామకృష్ణంరాజు రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. విజయనగరం ఎంపీ సీటు కుదరకపోతే ఏదైనా అసెంబ్లీకి తన పేరు పరిశీలించాలని కోరుతున్నట్లు సమాచారం. ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు.. తర్వాత ఆ పార్టీ విధానాలను ధిక్కరించి స్వతంత్రంగా వ్యవహరించారు. ఏ పార్టీలో చేరకుండా టీడీపీకి మద్దతు పలుకుతూ వచ్చారు. తాజాగా బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ టికెట్ ఆశించారు. కానీ, చివరకు రఘురామరాజును ఏ మాత్రం పట్టించుకోలేదు బీజేపీ. పొత్తులో భాగంగా నరసాపురం లోక్‌సభ స్థానాన్ని తీసుకున్న బీజేపీ రఘురామకృష్ణంరాజును కాదని.. భూపతి రాజు శ్రీనివాస వర్మకు టికెట్ ఇచ్చింది.