అడ్రస్ మారిస్తే దగ్గరైపోతారా?
అడ్రస్ హైదరాబాద్ నుండి మంగళగిరికి మార్చేస్తే సరిపోతుందా? అడ్రస్ మార్చినంత మాత్రాన ఏపీ జనాలకు పవన్ దగ్గరైపోతారా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనలు చాలా విచిత్రంగా ఉంటాయి. తాజాగా తన అడ్రస్‌ను హైదరాబాద్ నుండి మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు మార్చుకున్నారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల కారణంగా జనాలకు దగ్గరగా ఉండటానికట. జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు తరచూ పవన్‌పై చేస్తున్న ఆరోపణల్లో ఒకటేమిటంటే హైదరాబాద్‌లో కూర్చుని ఏపీ రాజకీయాలను కంపు చేస్తున్నారని. అందుకని తన స్థానికతను ప్రశ్నించేవాళ్ళకి అందరికీ సరైన సమాధానం చెప్పటం కోసమే హైదరాబాద్ నుండి మంగళగిరికి మకాం మార్చేసినట్లు చెప్పారు. జనాలకు దగ్గరవ్వటం అంటే అడ్రస్ మార్చుకోవటమే అనుకుంటున్నట్లున్నారు.
అడ్రస్ హైదరాబాద్ నుండి మంగళగిరికి మార్చేస్తే సరిపోతుందా? అడ్రస్ మార్చినంత మాత్రాన ఏపీ జనాలకు పవన్ దగ్గరైపోతారా? 1982లో తెలుగుదేశంపార్టీ పెట్టినపుడు ఎన్టీయార్ పర్మనెంటు అడ్రస్ చెన్నై. అప్పటికే సినిమా పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్‌కు మారింది కాబట్టి హైదరాబాద్‌లో కూడా ఇల్లు, స్టూడియో కట్టుకున్నారు. కానీ ఎక్కువకాలం షూటింగుల కారణంగా ఉన్నది చెన్నైలోనే. కానీ పార్టీ పెట్టగానే జనాలు టీడీపీని గెలిపించలేదా?
చంద్రబాబుకి చంద్రగిరిలో, జగన్‌కు పులివెందులలో ఇళ్లు ఉన్నా.. శాశ్వత నివాసాలైతే హైదరాబాదే కదా. అయినా వాళ్ళని జనాలు ఆదరించారు కదా. ఎందుకు ఆదరించారంటే జనాల్లో వాళ్ళు నమ్మకం సంపాదించుకున్నారు. వాళ్ళ పార్టీలను గెలిపించాలని జనాల్లో ఆలోచన వచ్చేట్లుగా పార్టీని నిత్యం జనాల్లోనే ఉండేట్లుగా చూసుకున్నారు. మరి పవన్ ఆ పని చేస్తున్నారా?
ఓట్లేయాల్సిన జనాల మీద పవన్‌కు నమ్మకంలేనట్లే జనాలకు కూడా పవన్ పైన నమ్మకంలేదు. అందుకనే పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను ఓడించారు. తనకున్న సమయంలో ఎక్కువ భాగం షూటింగులకు అక్కడ ఖాళీ దొరికితే మాత్రమే రాజకీయాలకు పవన్ కేటాయిస్తున్నారు. కాబట్టే పవన్ను జనాలు నమ్మలేదు. మరిప్పటకైనా తన పద్దతి మార్చుకున్నారా అంటే లేదనే చెప్పాలి. ఓట్లేసి జనసేనను, పవన్ను గెలిపించుకోవాలని జనాలు అనుకోవాలి కాని అడ్రస్ ఎక్కడుంటే ఏమిటి ? జనాల్లో నమ్మకం కుదరనపుడు పవన్ హైదరాబాద్‌లో ఉన్నా.. మంగళగిరిలో ఉన్నా ఒకటే.