ఈ కమిటీతో ఏం చేయదలచుకున్నారు?
ఇప్పుడు అపాయింటైన వాళ్ళల్లో చాలామంది టీవీ డిబేట్లలో అదరగొట్టేస్తారు. అదే జనాల్లో తిరిగి పార్టీకి వంద ఓట్లు వేయించమంటే చేతకాదు.
మొత్తం 30 మందితో బీజేపీ కొత్త కార్యవర్గాన్ని అధ్యక్షురాలు నియమించారు. కొత్త కమిటీపై తనదైన ప్రత్యేకమైన ముద్ర ఉండాలని అధ్యక్షురాలు అనుకున్నట్లున్నారు. చాలామంది కొత్తవాళ్ళనే కార్యవర్గంలోకి తీసుకున్నారు. విష్ణువర్ధనరెడ్డి, పాతూరి నాగభూషణం, ఆదినారాయణరెడ్డి, మాధవ్ లాంటి కొద్దిమంది పాత కమిటీలో కూడా ఉన్నారు. ఇప్పుడు సమస్య కమిటీలో ఎంతమంది ఉన్నారని కాదు. ఎంతమంది గట్టి వాళ్ళున్నారన్నదే అసలైన పాయింట్. కమిటీ మొత్తం మీద చూస్తే సొంతంగా వెయ్యి ఓట్లు సంపాదించుకోగలిగిన వాళ్ళు ఒకళ్ళు లేదా ఇద్దరికన్నా లేరు.
నలుగురు ప్రధాన కార్యదర్శులు, 11 మంది ఉపాధ్యక్షులు, 10 మంది కార్యదర్శులున్నారు. వీళ్ళల్లో చాలామంది జనాలకు పరిచయం ఉన్నవాళ్ళే. ఎలాగంటే మీడియా సమావేశాల ద్వారా లేదా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ద్వారా మాత్రమే. ప్రజల్లో తిరుగుతూ తాము బలపడి పార్టీని బలోపేతం చేసేంత సీనున్న నేతలు ఒక్కళ్ళు కూడా లేరు. ఇప్పుడు అపాయింటైన వాళ్ళల్లో చాలామంది టీవీ డిబేట్లలో అదరగొట్టేస్తారు. అదే జనాల్లో తిరిగి పార్టీకి వంద ఓట్లు వేయించమంటే చేతకాదు.
కొత్తగా అపాయింటైన వాళ్ళల్లో చాలామంది ఆ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయమని అడిగితే చేయలేదు. ఎందుకంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు తమ స్థాయి కాదని తప్పించుకున్నారు. అసలు విషయం ఏమిటంటే వీళ్ళు నిలబడితే వీళ్ళ సత్తా ఏమిటో అందరికీ తెలిసిపోతుంది. తెరవెనుక నుండి చక్రం తిప్పుదామని చూసేవాళ్ళు కానీ బయటకొచ్చి పనిచేద్దామని ఎవరికీ లేదు.
విష్ణువర్ధనరెడ్డి, ఆదినారాయణరెడ్డి, మాధవ్, పాతూరి, చందు సాంబశివరావు లాంటి వాళ్ళ వల్ల పార్టీకి ఏం ఉపయోగమే పురందేశ్వరికే తెలియాలి. వాస్తవం మాట్లాడితే పురందేశ్వరికే జనాల్లో పట్టులేదు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో వైజాగ్‌లో పోటీ చేస్తే ఆమెకు డిపాజిట్ కూడా దక్కలేదు. గ్రౌండ్ లెవల్లో బలమైన వాళ్ళని నియమిస్తే ఎక్కడ డామినేట్ చేస్తారో అనే ఆలోచనతోనే జనబలం లేని వాళ్ళని ఏరికోరి పురందేశ్వరి కార్యవర్గంలోకి తీసుకున్నట్లున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కొత్త కమిటీ ఏం చేస్తుందో చూడాలి.