సెప్టెంబర్ 19న వైఎస్ జగన్ ఏం చెప్పబోతున్నారు.?
ఏపీ అసెంబ్లీకి మరో ఏడాదిన్నరలో ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఓ వైపు ప్రభుత్వపరంగా చేయాల్సిన పనులను చేస్తూనే.. మరో వైపు పార్టీ విషయాలను కూడా చక్కబెడుతున్నారు.
ఏపీ అసెంబ్లీకి మరో ఏడాదిన్నరలో ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఓ వైపు ప్రభుత్వపరంగా చేయాల్సిన పనులను చేస్తూనే.. మరో వైపు పార్టీ విషయాలను కూడా చక్కబెడుతున్నారు. అసెంబ్లీ సమవేశాల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ అమరావతిలో అందుబాటులో ఉండటంతో.. ఈ నెల 19న కీలక సమావేశం నిర్వహించడానికి వైఎస్ జగన్ నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, నియోజకవర్గ ఇంచార్జులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఇప్పటికే సీఎం వద్దకు అందరి పని తీరుపై నివేదికలు వచ్చాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మక్మంగా చేపట్టిన.. 'గడప గడపకు ప్రభుత్వం' కార్యక్రమంలో ఎవరు ఎలా పాల్గొన్నారనే విషయాలను కూడా తెప్పించుకున్నారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పని తీరుపై ఈ సమావేశంలో సీఎం జగన్ సమీక్షించనున్నట్లు తెలుస్తున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులకే సీట్లు ఇచ్చే విషయంలో ఓ క్లారిటీ రానున్నది. అయితే, ఆ ప్రకటన చేసే ముందుగా.. జగన్ వారికి గట్టిగానే క్లాస్ తీసుకుంటారని సమాచారం. ఇటీవల వచ్చిన కొన్ని నివేదికల్లో ఎమ్మెల్యేల పని తీరు ఆశించిన విధంగా లేదని.. క్షేత్ర స్థాయిలో వారి పట్ల వ్యతిరేకత ఉన్నట్లు కూడా వెల్లడైంది. అలాంటి ఎమ్మెల్యేలు పని తీరు మార్చుకోకుంటే టికెట్లు ఇచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పనున్నారు. ఇప్పటికే కేబినెట్ భేటీ సందర్భంగా మంత్రులకు ఘాటైన హెచ్చరికలు చేసిన వైఎస్ జగన్.. ఇప్పుడు ఎమ్మెల్యేలకు అదే విధంగా హిత బోధ చేయనున్నట్లు సమాచారం.
రాబోయే రోజుల్లో ప్రతీ నియోజకవర్గంలో పార్టీ నుంచి పరిశీలకుడిని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. నియోజకవర్గ పరిస్థితులు, ఎమ్మెల్యేల పని తీరుపై వీళ్లు ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదికల ఆధారంగానే వైఎస్ జగన్ టికెట్లు ఇవ్వాల్సిన వారి లిస్టుకు తుది రూపం ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం జగన్ జిల్లాల వారీగా సమావేశాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. అక్కడ కూడా మరోదఫా సమీక్ష నిర్వహించి పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడే చర్యలు తీసుకోనున్నారు.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాకు సంబంధించి సమన్వయకర్తలను ఏర్పాటు చేశారు. వీరికి కూడా వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. గతంలో సోషల్ మీడియా కోసం స్వతంత్రంగా పని చేసిన కార్యకర్తల వల్ల కోర్టు కేసుల వరకు వ్యవహారం వెళ్లింది. ఇకపై అలా కాకుండా, అంశాల వారీగా ప్రతిపక్షాలను ఎండగట్టడం.. ప్రభుత్వ అభివృద్ధిని ఎలా ప్రచారం చేయాలనే విషయాలను సోషల్ మీడియా ప్రతినిధులకు వైఎస్ జగన్ వివరించనున్నట్లు తెలుస్తున్నది.