Telugu Global
Andhra Pradesh

మద్యంపై పురందేశ్వరి ఆరోపణల్లో నిజమెంత..?

చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటుచేసిన మద్యం దుకాణాలను, బెల్టుషాపులను పూర్తిస్థాయిలో మూసివేసింది. మద్యం దుకాణాల నిర్వహణను ప్రభుత్వమే చేపట్టింది.

మద్యంపై పురందేశ్వరి ఆరోపణల్లో నిజమెంత..?
X

మద్యంపై పురందేశ్వరి ఆరోపణల్లో నిజమెంత..?

బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్రంలో మద్యపాన‌ నిషేధం హామీ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపణలు చేస్తున్నారు. మద్యం దుకాణాలను అడ్డుపెట్టుకొని కోట్లు గడిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనిపై ఏకంగా సీబీఐ విచారణ చేయించాలంటూ అమిత్‌షాకు ఫిర్యాదు కూడా చేయడం తెలిసిందే.

వైసీపీ ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. మద్య నిషేధం హామీని దశలవారీగా అమలు చేస్తామని స్వయంగా సీఎం జగన్‌ బహిరంగ సభల్లో చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే.. వైసీపీ అధికారంలోకి రాగానే.. చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటుచేసిన మద్యం దుకాణాలను, బెల్టుషాపులను పూర్తిస్థాయిలో మూసివేసింది.

మద్యం దుకాణాల నిర్వహణను ప్రభుత్వమే చేపట్టింది. ఒకపక్క మద్యం దుకాణాలను తగ్గించడం, ధరలను భారీగా పెంచడం ద్వారా మ‌ద్యం కొనుగోలు చేయాలంటే ఆ ధరలను చూసి వెనుకంజ వేసే పరిస్థితి తీసుకొచ్చారు. తద్వారా తొలిదశలో విచ్చలవిడి మద్యపానానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.

పురందేశ్వరి పోరాటం.. సిండికేట్ల కోసమేనా..

మద్యం సిండికేట్ల నుంచి దుకాణాలను తొలగించి.. ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ప్రజల ఆరోగ్యాన్ని పీల్చి పిప్పి చేసి తమ జేబులు నింపుకొంటున్న మద్యం సిండికేట్లకు ప్రభుత్వ చర్యలతో అడ్డుకట్ట పడింది. మద్యం సిండికేట్ల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పలు పత్రికలు కొద్దికాలంగా వారి ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయనేది వైసీపీ ఆరోప‌ణ‌.

ఇటీవల కాలంలో మద్యం సిండికేట్లకు కొమ్ముకాస్తూ.. ఈ దాడి మరింత పెంచడం గమనార్హం. అయితే.. చంద్రబాబు నాయుడు స్కిల్‌ స్కామ్‌లో అడ్డంగా బుక్కయి జైలుకెళ్లారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తాను ఆ బాధ్యత నెత్తిన మోస్తూ.. మద్యం సిండికేట్లకు ప్రయోజనం కలిగించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై వరుసగా ఆరోపణలు గుప్పిస్తున్నారనేది వైసీపీ విమర్శ.

ఎన్టీఆర్‌ టైమ్‌లోనూ ఇదే తీరు..

ఎన్టీఆర్‌ హయాంలోనూ మద్య నిషేధం హామీని అమలు చేయగా, ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకొచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచారు. అందుకు అనుకూల ప‌త్రిక‌లు కూడా బాబుకు వంత‌పాడాయి. దీంతో అప్పట్లో మళ్లీ సిండికేట్ల రాజ్యం వచ్చింది. ఇబ్బడిముబ్బడిగా మద్యం దుకాణాలతో పాటు వీధికో బెల్టు షాపు వచ్చి కుటుంబాల‌ను ఛిద్రం చేశాయి.

ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం కూడా మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తుండగా.. దానికి తూట్లు పొడిచేందుకు మరోసారి టీడీపీ అనుకూల పత్రికలు, చంద్రబాబు దానికి తూట్లు పొడవడానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో మద్యపాన నియంత్రణ చర్యలు చేపట్టిన జగన్‌ ప్రభుత్వంపై ఆ పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. వాటి కథనాలను అనుసరిస్తూ పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుండటం గమనార్హం.

First Published:  15 Oct 2023 12:45 PM IST
Next Story