Telugu Global
Andhra Pradesh

నేడే ఈబీసీ నేస్తం విడుదల.. వైజాగ్ స్టీల్ పై జగన్ స్పందిస్తారా..?

ఈబీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఓసీ వర్గాల పేద మహిళలకు ప్రతి ఏటా 15వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం. వరుసగా మూడో ఏడాది కూడా నిధులు విడుదల చేస్తున్నారు జగన్.

నేడే ఈబీసీ నేస్తం విడుదల.. వైజాగ్ స్టీల్ పై జగన్ స్పందిస్తారా..?
X

ఈబీసీ నేస్తం నిధుల విడుదల కోసం ఈరోజు ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ పర్యటించబోతున్నారు. మార్కాపురంలోని ఎస్వీకేపీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. స్థానికంగా చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేస్తారు. వేదికపై కంప్యూటర్ బటన్ నొక్కి.. ఈబీసీ వర్గాలకు చెందిన 4,39,068 మంది లబ్ధిదారులకు రూ.658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని విడుదల చేస్తారు. ఈబీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఓసీ వర్గాల పేద మహిళలకు ప్రతి ఏటా 15వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం. వరుసగా మూడో ఏడాది కూడా నిధులు విడుదల చేస్తున్నారు జగన్.

స్పందిస్తారా లేదా..?

అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ప్రజలకు సందేశం ఇవ్వాలంటే నేరుగా ప్రెస్ మీట్లు పెట్టడంలేదు. అసెంబ్లీ వేదికగా ప్రకటించడం కుదరకపోతే సంక్షేమ కార్యక్రమాలకోసం ఏర్పాటు చేసే సభల్లోనే ఆయన స్పందిస్తున్నారు. తాజాగా ఏపీలో వైజాగ్ స్టీల్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అధికార, ప్రతిపక్షాలు.. వారి వారి అనుకూల మీడియాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. వైజాగ్ స్టీల్ కి తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన సపోర్ట్, వైసీపీకి మరింత ఇబ్బందిగా మారింది. ఈ దశలో వైజాగ్ స్టీల్ వ్యవహారంపై సీఎం జగన్ స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి.

ప్రతిపక్షాలకు కోటింగ్ తప్పదు..

ఇటీవల ఏపీలో మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం మొదలైంది. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రజల్లోకి వెళ్లి.. వారినుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు, స్టిక్కర్లు అంటించి వస్తున్నారు. దీనికి పోటీగా టీడీపీ, జనసేన కూడా స్టిక్కర్ల కార్యక్రమం మొదలు పెట్టింది. ఏపీలో మంత్రి వర్గ విస్తరణ, ముందస్తు ఎన్నికలు లేవు అని జగన్ స్పష్టం చేసిన తర్వాత పొలిటికల్ హీట్ కాస్త తగ్గాల్సింది పోయి మరింతగా పెరిగింది. ఈ సమయంలో ప్రకాశం జిల్లాకు వస్తున్న జగన్ మరోసారి ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించే అవకాశముంది. ఎప్పటిలాగే దుష్టచతుష్టయం అనేసి సరిపెడతారా లేక మరింత ఘాటుగా బదులిస్తారా అనేది వేచి చూడాలి.

First Published:  12 April 2023 5:58 AM IST
Next Story