Telugu Global
Andhra Pradesh

ఆటలో అరటిపండేనా..?

ఏపీలోకి షర్మిల ఎంట్రీ ఇచ్చేటప్పటికే జనాలకు ఆమె మీద ఒక క్లారిటీ ఉంది. ఇక ఏపీలో అడుగుపెట్టిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా ఆరోపణలు, విమర్శలు చేయటంతప్ప ఇంకేమీ చేయటంలేదు.

ఆటలో అరటిపండేనా..?
X

కాంగ్రెస్‌లో పరిణామాలు చూస్తుంటే ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పరిస్థితి ఆటలో అరటిపండులా అనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించటానికి ముందే ఆమె అంటే ఏమిటో జనాలకు మంచి క్లారిటీ వచ్చేసింది. సొంతంగా ఒక పార్టీ పెట్టుకుని తెలంగాణ కోడలిని అంటూ అక్కడ హడావుడి చేయటానికి ప్రయత్నించారు. రెండేళ్ళు పార్టీని నడిపించినా ఉనికి కూడా చాటలేకపోయారు. ఉనికి కోసమే అచ్చంగా కేసీఆర్‌పై పదేపదే ఆరోపణలు సంధించారు. అయినా ఉపయోగంలేకపోయింది. అందుకనే ఎన్నికలకు ముందు పార్టీ జెండాను పీకేసి కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను ఏపీకి అధ్యక్షురాలిని చేసింది.

కాబట్టి ఏపీలోకి షర్మిల ఎంట్రీ ఇచ్చేటప్పటికే జనాలకు ఆమె మీద ఒక క్లారిటీ ఉంది. ఇక ఏపీలో అడుగుపెట్టిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా ఆరోపణలు, విమర్శలు చేయటంతప్ప ఇంకేమీ చేయటంలేదు. అందుకనే మొదట్లో ఉన్న ఊపు ఇప్పుడు కనబడటంలేదు. ఎల్లోమీడియా మద్దతుంది కాబట్టే ఈమాత్రమైనా షర్మిల ప్రచారంలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు షర్మిల వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని కూడా ఎవరు అనుకోవటంలేదు. ఎందుకంటే స్వతహాగా షర్మిలకు ఇమేజి ఏమీలేదు. ఒకపుడు వైఎస్సార్ కూతురు తర్వాత జగన్ చెల్లెలు అంతే.

రాబోయే ఎన్నికల్లో జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా లేదా ఓడినా షర్మిలకు వచ్చే లాభం ఏమీలేదు. ఎందుకంటే జగన్ ఓడితే క్రెడిట్లో ఎక్కువభాగం చంద్రబాబునాయుడుకు పోతుంది. ఒకవేళ రెండోసారి మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తే అప్పుడు టీడీపీ, జనసేనతో పాటు షర్మిల కూడా కనుమరుగైపోతారంతే. ఏ రకంగా చూసుకున్నా జగన్ గెలుపోటముల్లో షర్మిల ప్రభావం ఏమీ ఉండదనే అనుకోవాలి.

మొన్నటి ఎన్నికలకన్నా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు ఎక్కువచ్చినా కూడా అధిష్టానం పట్టించుకోదు. ఎందుకంటే అధిష్టానానికి కావాల్సింది రిజల్టు మాత్రమే. కాబట్టి షర్మిల హడావుడి అంతా ఎన్నికలు జరిగేంతవరకే అని అర్థ‌మవుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా తయారైనా షర్మిల పాత్ర మాత్రం ఆటలో అరటిపండే అని స్పష్టంగా తెలుస్తోంది. ఇంతోటి దానికే బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి షర్మిల ఎగిరిగెరిపడుతున్నారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

First Published:  18 Feb 2024 12:23 PM IST
Next Story