జెడీ లక్ష్మీనారాయణ టార్గెట్ అదేనా..!
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖలో ఓడిపోయినప్పటికీ తన దృష్టినంతా ఆ ప్రాంతంపైనే కేంద్రీకరించినట్టు ఇటీవల ఆయన చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టే రీతిలో సాగుతున్నాయి.
సీబిఐ అధికారిగా సంచలనాలు నమోదు చేసి ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో ప్రవేశించిన లక్ష్మీనారాయణ తన భవిష్యత్ రాజకీయాలపై మెల్లిమెల్లిగా స్పష్టత ఇస్తున్నారు. 2019లో జనసేన అభ్యర్ధిగా విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆయన దాదాపు మూడు లక్షల ఓట్ల వరకూ రాబట్టుకున్నారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో జనసేన పార్టీని వీడారు.. లోక్ సత్తా అధ్యక్షుడు మాజీ ఐఎఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ్ తన పార్టీలోకి వచ్చి పార్టీని నడిపించాలని కోరినా ఎందుకో ఆయన మొగ్గు చూపలేదు.
విశాఖలో ఓడిపోయినా లక్ష్మీనారాయణ మాత్రం తన దృష్టినంతా ఆ ప్రాంతంపైనే కేంద్రీకరించినట్టు ఇటీవల ఆయన చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టే రీతిలో సాగుతున్నాయి. మూడు రాజధానుల విషయంలోనూ, విశాఖ ఉక్కు విషయంలో, పథకాల అమలు వంటి విషయాల్లో ఆయన గళం విపక్షాలతో పోలి ఉంటోంది. అంటే ఖచ్చితంగా ఆయన వైసీపీకి వ్యతిరేకంగానే బలంగా పనిచేసేలా కనబడుతోంది. జగన్ ను లక్ష్యంగా చేసుకునే ఆయన రాజకీయంగా అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది.
ఇంతగా విశాఖ పై ఆయన విశ్వాసం ఉంచడానికి గల కారణాలు లేకపోలేదంటున్నారు. వైసిపి నేతలపై భూ ఆక్రమణల ఆరోపణలతో పాటు ఆ నాయకుల వ్యవహార శైలిపై ప్రజల్లో అసంతృప్తి ఉందని లక్ష్మీనారాయణకు గట్టి సమాచారం ఉందని తెలుస్తోంది. ఆయన జెడీగా పని చేసిన సమయంలో ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ఆయనకు అభిమానులు ఉన్నారని చెబుతుంటారు. ఇప్పుడు ఆ అభిమానమే అక్కడి పరిస్థితులపై సమాచారం అందిస్తోందని వినిపిస్తోంది. అందుకే ఆయన పరిస్థితులను మదింపు వేసుకుని వైసిపీ లక్ష్యంగా విశాఖ ను ఎన్నుకున్నారని అనుకుంటున్నారు.
తాను వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని విస్పష్టంగా ప్రకటించినా ఏపార్టీ తరపునుంచి పోటీలో దిగేది స్పష్టత లేదు. స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగుతారా లేక ఏదైనా రాజకీయ పార్టీ తరపున పోటీలో ఉంటారో ఇంకా స్పష్టం కాలేదు. ఒకవేళ పార్టీ తరపున పోటీలో ఉండాలనుకుంటే మళ్ళీ జనసేనలో చేరడం లేదా టిడిపి, బిజెపిల్లో ఏదో ఒకదానిలో చేరాల్సి ఉంటుంది. జనసేనాని తీరుపై అంతగా విమర్శలు చేసి పార్టీని వీడిన తర్వాత మళ్ళీ ఆ పార్టీలో చేరతారా అనేది అనుమానమే. ఇక టిడిపి, బిజెపీల్లో చేరకుండా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసినా ఆయన వ్యక్తిత్వం పై నమ్మకంతో జనసేన,టిడిపిలు మద్దతు ఇవ్వొచ్చు. బిజెపి కూడా నామమాత్రంగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఈ సారి ఎన్నికలు ఎలా ఉన్నా 2029 ఎన్నికల నాటికి ఆయన మరింత రాజకీయానుభవాన్ని కూడగట్టుకుని అప్పటికి ప్రదాన పార్టీ గా నిలవాలనుకుంటున్న బిజెపిలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు..