Telugu Global
Andhra Pradesh

భూమా అఖిల ప్రియకు సొంత కుటుంబ సభ్యులే చెక్ పెడుతున్నారా?

భూమా కుటుంబానికి ఉన్న ఘనమైన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడంలో అఖిల పూర్తిగా విఫలమవుతున్నారని ఆయన అభిమానులు అంటున్నారు.

భూమా అఖిల ప్రియకు సొంత కుటుంబ సభ్యులే చెక్ పెడుతున్నారా?
X

ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీకి రాజకీయంగా మంచి పట్టు ఉంది. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి దంపతులు ఎన్నో ఏళ్ల పాటు ఆళ్లగడ్డ, నంద్యాల నుంచి రాజకీయాలు చేశారు. కానీ తమ జీవితంలో ఒక్కసారి కూడా మంత్రి కాకుండానే చనిపోయారు. ఇక వారి వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన భూమా అఖిల ప్రియ చిన్న వయసులోనే మంత్రి అయ్యారు. తాను కోరుకోకుండానే కేబినెట్ మినిస్టర్ అయిపోయారు. అయితే, అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో అఖిల పూర్తిగా విఫలమయ్యారు. చంద్రబాబు హయాంలో పని చేసిన మంత్రుల్లో అఖిలది అత్యంత పూర్ పెర్‌ఫార్మెన్స్ అని చెప్పవచ్చు.

భూమా కుటుంబానికి ఉన్న ఘనమైన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడంలో అఖిల పూర్తిగా విఫలమవుతున్నారని ఆయన అభిమానులు అంటున్నారు. రాజకీయంగానే కాకుండా, అఖిల వ్యక్తిగత వ్యవహారశైలిపై కూడా టీడీపీ అధినేత చంద్రబాబు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తున్నది. 2019లో ఓడిపోయిన తర్వాత ఆమె ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కనిపించింది చాలా తక్కువే. దీంతో అక్కడ టీడీపీ శ్రేణులు పూర్తిగా డీలా పడ్డాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అఖిల ప్రియకు టికెట్ ఇచ్చేందుకు కూడా చంద్రబాబు, నారా లోకేశ్ ఆసక్తి చూపించడం లేదని సమాచారం.

ఇక అఖిల ప్రియకు కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు లేవు. ఆమె సొంత అన్న బ్రహ్మానందరెడ్డి విషయంలో తరచూ తలదూరుస్తున్నారు. నంద్యాలలో ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం ఉంటోంది.మరోవైపు చెల్లెలు మౌనికా రెడ్డితో కూడా ఆమెకు విభేదాలు ఉన్నాయి. ఇక భూమా నాగిరెడ్డి సన్నిహితులు, అనుచరులతో కూడా సరిగా వ్యవహరించక పోవడంతో అఖిలను వాళ్లు దూరం పెట్టారు. మొత్తానికి అఖిల ప్రస్తుతం ఒంటరిగా మారారని తెలుస్తున్నది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వడానికి సుముఖంగా లేనట్లు సమాచారం.

అఖిల ప్రియకు వచ్చే సారి టికెట్ వచ్చే అవకాశాలు పెద్దగా లేవని తెలుసుకున్న మౌనిక రెడ్డి.. టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో టీడీపీ టికెట్ మీద పోటీ చేసి గెలవాలని, అక్క అఖిల ప్రియకు చెక్ పెట్టాలంటే ఇందుకు మించిన ఆప్షన్ మరొకటి లేదని ఆమె భావిస్తున్నారు. ఇప్పటికే అఖిల ప్రియకు వ్యతిరేకంగా ఉన్న భూమా అనుచరులు, సన్నిహితులు, బంధువులను అందరితో ఈ విషయంపై సంప్రదించినట్లు తెలుస్తున్నది. ఆళ్లగడ్డ టికెట్ ఎలాగో భూమా కుటుంబాన్ని కాదని ఇవ్వరని.. ఆ టికెట్ ఏదో తనకే వచ్చేలా చూసుకుంటే మంచిదని మౌనిక కూడా ఆలోచిస్తున్నారు. మరి చంద్రబాబు మౌనిక అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే.

First Published:  19 Dec 2022 2:18 AM GMT
Next Story