Telugu Global
Andhra Pradesh

ఆ రోజు ఏం జరిగింది? ఎన్టీఆర్‌పై వెన్నుపోటు ఘటనపై తొలిసారి నోరు విప్పిన చంద్రబాబు

1995లో టీడీపీలో చోటు చేసుకున్న అంతర్గత సంక్షోభంపై చంద్రబాబు తొలిసారి నోరు విప్పారు. ఆ నాటి నిర్ణయం వెనుక సాక్ష్యులు కేవలం ఐదుగురు మాత్రమే అని చంద్రబాబు చెప్పారు.

ఆ రోజు ఏం జరిగింది? ఎన్టీఆర్‌పై వెన్నుపోటు ఘటనపై తొలిసారి నోరు విప్పిన చంద్రబాబు
X

రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం, సీఎంగా 14 ఏళ్లు పని చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. దేశ రాజకీయాల్లో చెప్పుకోదగిన నాయకుల్లో చంద్రబాబు ఒకరు. ఆయన రాజకీయ పరంగా ఎన్ని విజయాలైనా సాధించినా.. అందరూ గుర్తు పెట్టుకునేది మాత్రం మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిందే. సొంత మామను మోసం చేసి పార్టీని, సీఎం పదవిని లాగేసుకున్నాడనే మచ్చ ఆయన జీవితం నుంచి చెరిగిపోదు. కాగా, 1995లో వైస్రాయ్ (ఇప్పుడు మారియట్) హోటల్ వేదికగా జరిగిన రాజకీయ సంక్షోభం ఎవరూ మరిచిపోలేదు. అయితే అందుకు దారి తీసిన సంఘటనలపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తుంటారు. ఆనాడు చంద్రబాబు వెంట ఉన్న తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ విషయాలపై తర్వాత కాలంలో బుక్ కూడా రాశారు. కానీ, చంద్రబాబు మాత్రం ఏనాడూ నోరు విప్పలేదు. తాజాగా బాలకృష్ణ నిర్వహిస్తున్న 'అన్‌స్టాపబుల్ 2' కార్యక్రమంలో చంద్రబాబును ఈ విషయాన్ని అడిగారు.

1995లో టీడీపీలో చోటు చేసుకున్న అంతర్గత సంక్షోభంపై చంద్రబాబు తొలిసారి నోరు విప్పారు. ఆ నాటి నిర్ణయం వెనుక సాక్ష్యులు కేవలం ఐదుగురు మాత్రమే అని చంద్రబాబు చెప్పారు. ఆ రోజు నాతో పాటు బాలకృష్ణ, హరికృష్ణ, బీవీ మోహన్‌రెడ్డి, ఎన్టీఆర్ గదిలో ఉన్నాము. తాము ఎందుకు వచ్చామో ఎన్టీఆర్‌కు ముందే తెలిసినా.. ఎందుకు వచ్చారని అడిగారు. మీతో మాట్లాడాలి అని అని చెప్పగా.. ఫ్యామిలీ మ్యాటరా? పొలిటికల్ మ్యాటరా? అని ఎన్టీఆర్ అడిగారు. ఫ్యామిలీ విషయం మాట్లాడాలంటే కొడుకులు, అల్లుడు ఉండండి.. పొలిటికల్ మ్యాటర్ మాట్లాడాలంటే అల్లుడు మాత్రమే ఉంటే సరిపోతుందని చెప్పారు. దీంతో నేనే మూడు గంటల పాటు ఆయనతో మాట్లాడాను. చాలా సేపు ఎన్టీఆర్‌ను ప్రాధేయపడ్డాను.. చివరకు కాళ్లు కూడా పట్టుకున్నాను, కానీ ఆయన మా మాట వినలేదు. అన్ని ప్రయత్నాలు విఫలం కావడం వల్లే ఆనాడు ఆ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని చంద్రబాబు చెప్పారు.

కాగా, ఆ రోజు జరిగిన విషయం తెలిసిన వ్యక్తుల్లో హరికృష్ణ, బీవీ మోహన్ రెడ్డి, ఎన్టీఆర్ ముగ్గురూ లేరు. ఇక చెప్పాల్సింది ఆ నాడు ఉన్న నువ్వే చెప్పాలంటూ బాలకృష్ణను అడిగారు. ఆనాడు నేను తీసుకున్న నిర్ణయం తప్పా అని ప్రశ్నించారు. అయితే బాలయ్య సూటిగా సమాధానం చెప్పకుండా.. నాన్నకు నాయకుడిగా కంటే పర్సనల్ ఎమోషన్ పెరిగిపోయిందని పరోక్షంగా లక్ష్మీపార్వతిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తి ఇన్‌ఫ్లూయన్స్ పెరిగిపోయిందని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ తన లైఫ్‌లో ఆరాధ్యదైవమని, ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. చివరకు ఆ రోజు తీసుకున్న నిర్ణయం తప్పు కాదని నందమూరి కుటుంబ సభ్యుడిగా, పార్టీ వ్యక్తిగా తాను చెప్తున్నానని బాలయ్య అన్నారు.

ఇక హైదరాబాద్‌ను ఎన్టీఆర్ విజనరీతో తానే అభివృద్ధి చేశానని మరోసారి చెప్పుకున్నారు. ఎపిసోడ్ ప్రారంభంలోనే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పిడిపై మండిపడ్డారు. మరో ఒకటిన్నర ఏడాదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఎన్టీఆర్ పేరు పెడతానని చంద్రబాబు అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు కట్టడానికి కారకుడిని నేనే అని.. దానికి కూడా ఎన్టీఆర్ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టారని అన్నారు. మొత్తానికి ఎప్పుడూ సినమా వాళ్లతో సరదాగా సాగిపోయే అన్‌స్టాపబుల్ షోను చంద్రబాబును తీసుకొచ్చి పొలిటికల్ చర్చగా మార్చేశారు.

First Published:  14 Oct 2022 5:46 PM IST
Next Story