Telugu Global
Andhra Pradesh

రిజిస్ట్రేషన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం డైలమా.. కోర్టుకి ఏం చెప్పిందంటే..?

గెజిటెడ్ ఆఫీసర్ల అధికారాలను, కార్యదర్శులకు ఎలా ఇస్తారనే విషయంలో కోర్టులో పిటిషన్లు దాఖలైన తర్వాత ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంటోంది. సబ్ రిజిస్ట్రార్ల అధికారాలు తొలగించలేదని చెప్పింది.

రిజిస్ట్రేషన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం డైలమా.. కోర్టుకి ఏం చెప్పిందంటే..?
X

గ్రామ, వార్డు సచివాలయాలతో సమాంతర ప్రభుత్వాన్ని నడపడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే సచివాలయాల రాకతో తహసీల్దార్ కార్యాలయాలకు వచ్చేవారి సంఖ్య తగ్గుతుందని భావించినా అది కుదర్లేదు. సచివాలయాలు వచ్చినా తహసీల్దార్ కార్యాలయాల్లోనే పనులు జరగాల్సిన పరిస్థితి. ఇక స్థలాలు, పొలాల రిజిస్ట్రేషన్ల విషయంలో కూడా మరో సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ అధికారాలను గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు కట్టబెట్టింది. అంటే పరోక్షంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇక పని ఉండదనమాట. ఇదే విషయంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ కి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేకపోయింది. రిజిస్ట్రేషన్ అధికారాలను సబ్ రిజిస్ట్రార్లనుంచి తొలగించలేదని చెప్పింది.

ఎందుకిన్ని వ్యవస్థలు..?

కొత్తగా ఏదైనా వ్యవస్థ వస్తే ప్రజల అవస్థలు తీరాలి. కానీ సచివాలయాలు, వాలంటీర్లతో కలిగే అదనపు ప్రయోజనాలు ఏంటనేది తేలడంలేదు. సబ్ రిజిస్ట్రార్ల అధికారాలను సచివాలయ కార్యదర్శులకు కట్టబెడుతూ తీసుకున్న నిర్ణయం ఇప్పటికే విమర్శలపాలైంది. గెజిటెడ్ ఆఫీసర్ల అధికారాలను, కార్యదర్శులకు ఎలా ఇస్తారనే ప్రశ్నలు వినిపించాయి. కోర్టులో పిటిషన్లు దాఖలైన తర్వాత ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంటోంది. సబ్ రిజిస్ట్రార్ల అధికారాలు తొలగించలేదని చెప్పింది.

రిజిస్ట్రేషన్ల అధికారం సబ్ రిజిస్ట్రార్లకు తొలగించలేదు అంటే, దానికి సమాంతరంగా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టడం అనవసరం. రాష్ట్రంలోని చాలా చోట్ల సచివాలయాల్లో కంప్యూటర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, మొబైల్ డేటాతో పనులు జరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల ఇన్వర్టర్లు లేవు, అందులోనూ రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్లను మెయింటెన్ చేయగలిగేంత సామర్థ్యం ఉన్న కంప్యూటర్లు సచివాలయాల్లో లేవు. మరి రిజిస్ట్రేషన్ వ్యవస్థను సచివాలయాలకు బదిలీ చేయడం దేనికి..? అలా బదిలీ చేస్తే అసలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లు ఎందుకు.. ? దీనికి సమాధానం చెప్పడంలో ప్రభుత్వం తడబడటంతో హైకోర్టు విచారణను నవంబర్-1కి వాయిదా వేసింది. పూర్తి వివరాలను మెమో రూపంలో కోర్టుకి సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

First Published:  20 Oct 2022 8:37 AM IST
Next Story