నీతులు చెబుతున్న వెంకయ్య.. ఏపీకి ఏం చేశారు..?
మరి ఏపీకి ప్రత్యేకహోదా దక్కిందా..? విశాఖపట్నం ప్రత్యేక రైల్వేజోన్ ఎందుకు రాలేదో వెంకయ్య సమాధానం చెప్పగలరా..? హోదా, రైల్వేజోన్ సాధనలో వెంకయ్య చేసిన కృషి ఏమిటి..?
'ఎంతకాలం బతికామన్నది కాదు ముఖ్యం.. దేశానికి ఏం చేశామన్నదే ముఖ్యం' ఇది తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు. భోగాపురంలో ఒక కళాశాల గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్ధులను ఉద్దేశించి వెంకయ్య చెప్పినదాంట్లో ఎలాంటి తప్పులేదు. మరి ఈ ప్రశ్నను ఎవరైనా వెంకయ్యను అడిగితే ఏమి సమాధానం చెబుతారు..? గడచిన 50 ఏళ్ళుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో వెంకయ్య ఎన్నో పదవులను అందుకున్నారు.
బీజేపీలో అందుకున్న పార్టీ పదవులను వదిలేస్తే ఎంఎల్ఏగా, లోక్ సభ, రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. కేంద్రమంత్రిగా ఎన్నో సంవత్సరాలున్నారు. చివరగా ఉపరాష్ట్రపతిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇన్ని దశాబ్దాల్లో వెంకయ్య వల్ల దేశానికి జరిగిన మేలు ఏమిటి ? దేశం సంగతిని పక్కనపెట్టేస్తే సమైక్య రాష్ట్రం లేదా 2014 తర్వాత ఏపీకి జరిగిన లాభం ఏమిటి అనేది వెంకయ్య చెప్పగలరా ? సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోవటంలో వెంకయ్య పాత్రకూడా కీలకమే.
రాష్ట్ర విభజన తర్వాత విభజన చట్టం అమలులో నరేంద్రమోడీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తుంటే వెంకయ్య ఏమిచేశారు. 2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడగానే ప్రత్యేకహోదా సాధించిన యోధుడంటూ విశాఖపట్నం, విజయవాడలో పౌరసన్మానం చేయించుకున్నారు. మరి ఏపీకి ప్రత్యేకహోదా దక్కిందా..? విశాఖపట్నం ప్రత్యేక రైల్వేజోన్ ఎందుకు రాలేదో వెంకయ్య సమాధానం చెప్పగలరా..? హోదా, రైల్వేజోన్ సాధనలో వెంకయ్య చేసిన కృషి ఏమిటి..?
విభజన చట్టాన్ని మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తుంటే కేంద్రమంత్రిగా వెంకయ్య చోద్యం చూశారు కానీ ఏరోజు మోడీని నిలదీయలేదే. కేంద్రమంత్రిగా ఉన్న తనను ఇష్టంలేకపోయినా ఉపరాష్ట్రపతిని చేశారని బాధపడ్డారే కానీ, రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఏ రోజు బాధపడలేదు. అన్నీ పదవులను హ్యాపీగా అనుభవించి చివరకు రాజ్యసభ ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఎంపీల ఫిరాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకయ్య ఇప్పుడు విద్యార్ధులకు, సమాజానికి నీతులు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.