Telugu Global
Andhra Pradesh

ముస్లిం కోటాకు బీజేపీ ఎసరు.. చంద్రబాబు ఏం చెప్తారు..?

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవేళ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఉంటాయా..? అనే అనుమానం కలుగుతోంది.

ముస్లిం కోటాకు బీజేపీ ఎసరు.. చంద్రబాబు ఏం చెప్తారు..?
X

ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని బీజేపీ నాయకులు స్పష్టంగానే చెప్పుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు కేటాయించిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని గ‌తంలో తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. తెలంగాణ బీజేపీ నాయకులు కూడా ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు. అందువల్ల తెలంగాణకు వర్తించేదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది.

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు సిద్ధ‌మ‌య్యారు. అందువల్ల ముస్లిం రిజర్వేషన్ల విషయంలో బీజేపీతో ఆయన విభేదించే అవకాశం లేదు. ఒకవేళ విభేదిస్తే ఆయన తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు ఆయన తన స్పష్టమైన వైఖరిని వెల్లడించలేదు. వెల్లడిస్తారనే నమ్మకం కూడా లేదు. ముస్లిం మైనారిటీలకు గ్యారంటీ అంటూ ఊదరగొడుతున్నారే తప్ప ముఖ్యమైన అంశాలపై తన వైఖరిని చెప్పడం లేదు.

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవేళ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఉంటాయా..? అనే అనుమానం కలుగుతోంది. బీజేపీ పెద్దలకు చంద్రబాబు పూర్తిగా లొంగిపోయారు కాబట్టి ఆయన ధైర్యంగా ఆ విషయంపై తన నిర్ణయాన్ని ప్రకటించకపోవచ్చు. యూసీసీపై గానీ, సీఏఏపై గానీ ఆయన తన వైఖరిని ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. బీజేపీ మాత్రం ఆ రెండింటినీ అమలు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పింది.

రాష్ట్రానికి సంబంధించి ఇతర ముఖ్యమైన అంశాలపై కూడా చంద్రబాబు స్పష్టత ఇవ్వడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై గానీ, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై గానీ ఆయన స్పష్టంగా ఏమీ చెప్పడం లేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం చంద్రబాబుతో కలిసి వేదికను పంచుకుంటున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా అదే మాట అన్నారు. ముఖ్యమైన అంశాలపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా చంద్రబాబు ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టాలని మాత్రమే చూస్తున్నారు.

First Published:  18 April 2024 10:03 AM GMT
Next Story