Telugu Global
Andhra Pradesh

బీజేపీతో పొత్తు.. చంద్రబాబుపై మరో పిడుగు

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అనేది చాలా కాలంగా నలుగుతూ వస్తోంది. గతంలో టీడీపీ దాన్ని వ్యతిరేకించింది. ప్రస్తుతం బీజేపీతో పొత్తు ఉన్నందువల్ల చంద్రబాబు ఏ విధమైన వైఖరి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

బీజేపీతో పొత్తు.. చంద్రబాబుపై మరో పిడుగు
X

ఇప్పటికే సీఏఏపై తన వైఖరిని స్పష్టం చేయని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై మరో పిడుగు పడింది. బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదివారంనాడు సంకల్ప్ పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని ఆ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీంతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చిక్కుల్లో పడ్డారు. ముస్లిం మైనారిటీలకు ఏం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితిని వారు ఎదుర్కుంటున్నారు.

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అనేది చాలా కాలంగా నలుగుతూ వస్తోంది. గతంలో టీడీపీ దాన్ని వ్యతిరేకించింది. ప్రస్తుతం బీజేపీతో పొత్తు ఉన్నందువల్ల చంద్రబాబు ఏ విధమైన వైఖరి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఆయన బీజేపీని వ్యతిరేకించే పరిస్థితిలో లేరు. ఈ స్థితిలో టీడీపీ ఆంధ్రరాష్ట్రంలో ముస్లిం మైనారిటీల మద్దతును కోల్పోయే ప్రమాదం ఉంది.

బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టం తెస్తుంది. ఒక్కసారి అది చట్టం అయితే కులం, సామాజిక వర్గం, మతం, ప్రాంతం, భాష తదితర అంశాలకు అతీతంగా దేశంలోని ప్రజలందరికీ ఒక్కటే చట్టం వర్తిస్తుంది. దత్తత, వివాహం, విడాకులు తదితర అంశాలపై ప్రజలందరి పట్ల ప్రభుత్వం ఒక్క రీతిలో ప్రవర్తిస్తుంది.

అయితే, ప్రస్తుతం యూసీసీపై బీజేపీ ఇచ్చిన హామీపై టీడీపీ నాయకత్వం మౌనం వహించింది. ఈ విషయంపై నోరు మెదపవద్దని చంద్రబాబు పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. యూసీసీపై తమ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుందని, అయితే ఎన్నికలు ముగిసే వరకు నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల తర్వాత చంద్రబాబు కప్పదాటుగా వ్యవహరిస్తారనేది అందరికీ తెలిసిందే.

First Published:  15 April 2024 11:19 AM IST
Next Story