ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ సేవలను ఉపయోగించుకుంటాం... బీజేపీ అధ్యక్షుడి ప్రకటన
రాబోయే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ సేవలను ఉపయోగించుకుంటామని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు ప్రకటించారు. టీడీపీ తో తమకు పొత్తు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర హోం మంత్రి , బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన సమయంలో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమైనప్పటి నుంచి ఆ విషయంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ బీజేపీలో చేరతారా లేక బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తారా ? అనే ప్రశ్నలపై తీవ్రంగానే చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని, కుటుంబ పార్టీలతో బీజేపీ ఎన్నడూ కలిసి పనిచేయబోదని ఆయన స్పష్టం చేశారు. జనసేనతో తమకు పొత్తు ఉంటుందని చెప్పిన వీర్రాజు తమ రెండుపార్టీల మధ్య ఎప్పటి నుంచో పొత్తు ఉంది, ఇప్పుడు కొనసాగుతుంది, రాబోయే రోజుల్లో కూడా ఉంటుంది. మీరే అనవసర అనుమానాలు రేకిత్తిస్తున్నారు అని జర్నలిస్టులను నిందించారు.
అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆయనను తాము రాబోయే ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగించుకుంటామని చెప్పారు. ఎన్టీఆర్ కు ఉన్న ప్రజాధరణ గొప్పదని దాన్ని తాము వినియోగించుకుంటామని వీర్రాజు అన్నారు. అయితే ఎన్టీఆర్ బీజేపీ తరపున తెలంగాణలో ప్రచారం చేస్తారా లేక ఆంధ్రప్రదేశ్ లోనా అని జర్నలిస్టులు ప్రశ్నించగా ఆయన కోసం ఎక్కడ ఎక్కువగా జనం వస్తారు? అని సోమూ వీర్రాజు తిరిగి ప్రశ్నించారు.