నీరా కేఫ్‌లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ను కోరతాం : ఏపీ మంత్రి జోగి రమేశ్
నీరాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని.. శాస్త్రీయంగానూ నిరూపితమైందని మంత్రి జోగి రమేశ్ పేర్కొన్నారు.
నీరా కేఫ్‌లను ఏపీలో కూడా ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ను కోరతామని.. దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని ఏపీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను తెలంగాణ ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సినిమా నటుడు సుమన్‌తో కలిసి మంత్రి జోగి రమేశ్ మంగళవారం సందర్శించారు.
అక్కడ నీరా నిల్వ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నీరాను తాగి, తినుబండారాలను రుచి చూశారు. పక్కనే తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన బోటింగ్‌ను కూడా మంత్రి జోగి రమేశ్ పరిశీలించారు. నీరాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని.. శాస్త్రీయంగానూ నిరూపితమైందని మంత్రి జోగి రమేశ్ పేర్కొన్నారు.
వేదాల్లో కూడా నీరా గురించి ప్రస్తావన ఉందని.. కాల క్రమంలో నీరా గురించి తప్పుడు ప్రచారం జరిగిందని జోగి రమేశ్ తెలిపారు. ప్రకృతి సిద్ధమైన, స్వచ్ఛమైన నీరాను రాష్ట్ర ప్రజలకు అందించడం పట్ల జోగి రమేశ్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
గీత వృత్తి కార్మికులను ఆదుకునే విధంగా నీరా పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నీరా కేఫ్‌ను సందర్శించడానికి వచ్చిన మంత్రి జోగి రమేశ్‌ను శ్రీనివాస్ గౌడ్ శాలువాతో సత్కరించారు. నీరా కేఫ్ చాలా బాగుందని సినీ నటుడు సుమన్ కూడా మెచ్చుకున్నారు.
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గారు మరియు ప్రముఖ నటుడు సుమన్ గార్లతో కలిసి సందర్శించడం జరిగింది. pic.twitter.com/vqMkcHXPDO
— V Srinivas Goud (@VSrinivasGoud) May 16, 2023