మేం అమరావతిని వద్దనలేదు -గుడివాడ అమర్నాథ్
ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు తామెప్పుడూ సిద్ధమేనని పేర్కొన్నారు గుడివాడ అమర్నాథ్.
అమరావతి వద్దు అని తాము చెప్పలేదన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అమరావతి కాదు, విశాఖ ఒక్కటే ఏపీకి రాజధాని అని తామెప్పుడూ అనలేదని, విశాఖతో పాటు కర్నూలు, అమరావతిని అభివృద్ధి చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం చెప్పిందన్నారు. ఏపీకి విశాఖ కీలకంఅని, ఆ విషయంలో కూటమి దృష్టి పెట్టాలని ఆయన ఆకాంక్షించారు. విశాఖ నగరానికి ఉన్న సానుకూల అంశాలు, అవకాశాల్ని కూటమి గుర్తించాలన్నారు. రామాయ పట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టు పనులు అఖరి దశకు వచ్చాయని, భోగాపురం ఎయిర్ పోర్ట్ పనుల్ని కొత్త ప్రభుత్వం త్వరగా పూర్తి చేస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు గుడివాడ అమర్నాథ్.
ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు తామెప్పుడూ సిద్ధమేనని పేర్కొన్నారు గుడివాడ అమర్నాథ్. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిందేనని.. కేంద్రంలో కూటమికి భిన్నమైన అవకాశం వచ్చిందన్నారు. ప్రజా తీర్పుకి అనుగుణంగా కూటమి పని చేయాలన్నారు.
వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్..
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా పనిచేస్తుందన్నారు గుడివాడ అమర్నాథ్. కూటమి ప్రభుత్వానికి తాము సమయం ఇస్తామని, ప్రజలకిచ్చిన అన్ని హామీలు వారు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయని ఇది మంచి పద్ధతి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు సరికావన్నారు గుడివాడ. గెలిచిన వారు బలవంతులు కాదని, ఓడిన వారు బలహీనులు కాదన్నారు. ప్రజలకు ఇంటి దగ్గరికే పథకాలు వచ్చేలా చూశామని, అన్ని వర్గాలకు సమన్యాయం చేశామని, అయినా కూడా తాము ఓటమిపాలయ్యామని చెప్పారు అమర్నాథ్.