Telugu Global
Andhra Pradesh

పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు.. మధ్యలో చంద్రబాబు

బాబుతో నేను అంటూ టీడీపీ హడావిడి చేస్తోంది, నిరసన కార్యక్రమాలతో తంటాలు పడుతున్నారు నాయకులు. ఇప్పుడు పెళ్లిమండపాల్లో కూడా ఈ ట్రెండ్ మొదలు కావడం విశేషం.

పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు.. మధ్యలో చంద్రబాబు
X

వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ ల్లో కొంతమంది 'వుయ్ ఆర్ విత్ సీబీఎన్' అనే ప్లకార్డులతో దర్శనమిచ్చారు. ఆమధ్య న్యాయానికి సంకెళ్లు అంటూ చేపట్టిన నిరసనలో ఐసీయూలో ఉన్న ఓ వృద్ధ మహిళకు కూడా నల్ల రిబ్బన్లు కట్టి హడావిడి చేశారు. చంద్రబాబుకి మద్దతుగా చిన్న పిల్లలతో పంచ్ డైలాగులు పలికించడం.. వంటి రకరకాల విన్యాసాలు కూడా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ పెళ్లి మండపంలో కూడా 'వుయ్ ఆర్ విత్ చంద్రబాబు' అనే హడావిడి నడిచింది. పెళ్లికొచ్చిన అతిథులంతా ఆ సీన్ చూసి కంగారు పడ్డారు. నెటిజన్లు మాత్రం "ఏంట్రా ఇది ఇంత టాలెంటెడ్ గా ఉన్నారం"టూ వారిపై సెటైర్లు పేలుస్తున్నారు.

బాపట్ల జిల్లా పర్చూరు మండలం కొల్లావారిపాలెంకి చెందిన త్రినాథ్‌, గుంటూరు అశోక్‌ నగర్‌ కు చెందిన భాను పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి మండపంలో జీలకర్ర-బెల్లం ఘట్టం కంటే చంద్రబాబు ఫొటోలతో వధూవరులు ఇచ్చిన స్టిల్ హైలైట్ గా మారింది. జీలకర్ర-బెల్లం పెట్టే సమయంలో సడన్ గా ప్లకార్డులు తీసుకొచ్చారు కొందరు. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు సహా కుటుంబ సభ్యులంతా ఆ ప్లకార్డులు పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. చంద్రబాబుని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ పెళ్లిమండపంలో వారు నినాదాలు చేశారు.

పెళ్లిళ్లలో ఇదో కొత్త ట్రెండ్..

ఈమధ్య పవన్ కల్యాణ్ అభిమానులు పెళ్లి కార్డుల్లో ఆయన ఫొటో కచ్చితంగా ముద్రిస్తున్నారు, జనసేన స్లోగన్లు రాస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం కూడా పెళ్లి మండపాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇలాంటి సీన్లన్నీ ఎల్లో మీడియాలో మరింత హైలైట్ అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే బాబుతో నేను అంటూ టీడీపీ హడావిడి చేస్తోంది, నిరసన కార్యక్రమాలతో తంటాలు పడుతున్నారు నాయకులు. ఇప్పుడు పెళ్లిమండపాల్లో కూడా ఈ ట్రెండ్ మొదలు కావడం విశేషం.

First Published:  19 Oct 2023 10:40 AM IST
Next Story