కొలికపూడిపై హత్య ప్రయత్నం జరిగిందా..?
సకాలంలో కుటుంబసభ్యులు తనను ఆసుపత్రి చేర్చటంతో ప్రాణాలతో బయటపడినట్లు కొలికపూడి చెబుతున్నారు. తనపై వైసీపీ బ్యాచ్ భౌతికదాడి చేస్తుందని అనుమానిస్తున్నట్లు చెప్పిన కొలికపూడి ప్రసాదమని చెప్పి హత్యకు కుట్ర చేస్తుందని ఊహించలేదన్నారు.
తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు, చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుల్లో ఒకడు, ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడైన కొలికపూడి శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగిందా..? కొలికపూడి అయితే తనపై హత్యా ప్రయత్నమే జరిగిందని చెబుతున్నారు. అదికూడా వైసీపీనే చేసిందని ఆరోపణలు చేస్తున్నారు. తన ఆరోపణలకు మద్దతుగా కొలికపూడి ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయారు. అయినా సరే తనపై జరిగిన హత్యాయత్నానికి వైసీపీనే కారణమని పదేపదే ఆరోపిస్తున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. శుక్రవారం రాత్రి ఒక టీవీ చానల్లో జరిగిన డిబేట్ పూర్తిచేసుకుని ఇంటికి బయలుదేరారు. చానల్ ఆఫీసు దాటగానే ఆయన కారుకు ఎదురుగా ఒక వ్యక్తివచ్చి ఆపాడట. కారు ఆపగానే తనని తాను మునిరత్నంగా పరిచయం చేసుకున్నాడట. తాను కొలికపూడికి అభిమానిగా చెప్పుకున్న సదరు వ్యక్తి గుడినుండి ప్రసాదం తెచ్చానని చెప్పి ఒక పొట్లం తెరిచాడట. అందులోని పులిహోరను తాను తిన్నట్లు కొలికపూడి చెప్పారు. పులిహోరను తిన్న వెంటనే అక్కడనుండి ఇంటికి వెళ్ళిపోయారట.
ఇంట్లో భోజనం చేస్తుండగా ఒంటిపై దద్దుర్లు వచ్చేసి వాచిపోయాయట. వెంటనే వాంతులు కూడా మొదలై స్పృహతప్పిపోయారట. సకాలంలో కుటుంబసభ్యులు తనను ఆసుపత్రి చేర్చటంతో ప్రాణాలతో బయటపడినట్లు కొలికపూడి చెబుతున్నారు. తనపై వైసీపీ బ్యాచ్ భౌతికదాడి చేస్తుందని అనుమానిస్తున్నట్లు చెప్పిన కొలికపూడి ప్రసాదమని చెప్పి హత్యకు కుట్ర చేస్తుందని ఊహించలేదన్నారు.
ఇక్కడే కొలికపూడి ఆరోపణలపై కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. ఎవరో అపరిచిత వ్యక్తి కారును ఆపి పరిచయం చేసుకుని ప్రసాదమని పులిహోర ఇస్తే కొలికపూడి ఎలా తిన్నారు..? ముక్కూ మొహం తెలీని వ్యక్తి తన కారును ఆపి ప్రసాదం ఇచ్చినప్పుడే కొలికపూడికి అనుమానం రాలేదా..? భౌతికదాడులు జరుగుతుందని అనుమానిస్తున్న కొలికపూడి అపరిచిత వ్యక్తి ఇచ్చిన ప్రసాదాన్ని ఎలా తిన్నారు..? ఒకవేళ ప్రసాదం ఇచ్చి కొలికపూడిని హత్య చేయటమే సదరు అపరిచిత వ్యక్తి ఉద్దేశ్యం అయితే తనను తాను పరిచయం చేసుకుంటారా..? పోలీసులు విచారణ మొదలుపెడితే దొరికిపోతానని అపరిచిత వ్యక్తికి తెలీదా..? తనకు ప్రసాదం ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలీకుండానే వైసీపీ బ్యాచ్ పనే అని కొలికపూడి ఎలా చెప్పగలుగుతున్నారు..? ఈ ప్రశ్నలకు జవాబులు పోలీసుల విచారణలోనే తేలాలి.