Telugu Global
Andhra Pradesh

వ్యూహం, యాత్ర-2.. వైసీపీ ఛాయిస్ ఏంటి..?

లోకేష్ పిటిషన్ తో వ్యూహం విడుదలను కోర్టు అడ్డుకుంది. ఈనెల 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్ ని సస్పెండ్ చేసింది. ఈలోగా యాత్ర-2 టీజర్ రిలీజ్ కావడంతో 'వ్యూహం' స్థాయి ఏంటో అందరికీ తెలిసొచ్చింది.

వ్యూహం, యాత్ర-2.. వైసీపీ ఛాయిస్ ఏంటి..?
X

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం', మహి.వి.రాఘవ దర్శకత్వం వహించిన 'యాత్ర-2'. ఈ రెండు సినిమాలూ ఏపీ ఎన్నికలకు ముందు విడుదలకు సిద్ధమయ్యాయి. రెండు సినిమాలు వైఎస్ జగన్ ని హీరోగా చూపిస్తూ, చంద్రబాబుని విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నవే. కానీ ఈ రెండిటికీ చిన్న తేడా ఉంది. యాత్ర-2 ఎలా ఉంటుందో ఇటీవల విడుదలైన టీజర్ తో క్లారిటీ వచ్చింది. మనసుకు హత్తుకునే సన్నివేశాలతో, జగన్ క్రేజ్ ని పెంచేలా సినిమా ఉండబోతోందనే టాక్ వచ్చింది. అదే సమయంలో వైరి వర్గాల కుట్రల్ని కూడా బహిర్గతం చేసేలా ఉంటుందని అంటున్నారు. మరి దీనిపై వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి..? జగన్ ని హీరో చేస్తున్న సినిమా విషయంలో ఆ పార్టీ నేతలు ఆశించిన స్థాయిలో స్పందించకపోతే ఎలా..?

'వ్యూహం'లో ఏముంది..?

రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం'సినిమాకు మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలంతా సపోర్ట్ చేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి మరీ వర్మ గొప్పతనాన్ని పొగిడారు, ఈ సినిమా విడుదలైతే టీడీపీ వణికిపోతుందన్నారు. సీన్ కట్ చేస్తే లోకేష్ పిటిషన్ తో సినిమా విడుదలను కోర్టు అడ్డుకుంది. ఈనెల 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్ ని సస్పెండ్ చేసింది. ఈలోగా యాత్ర-2 టీజర్ రిలీజ్ కావడంతో 'వ్యూహం' స్థాయి ఏంటో అందరికీ తెలిసొచ్చింది.

ఇంతకీ వైసీపీ ఛాయిస్ ఏంటి..?

రామ్ గోపాల్ వర్మ ఏ స్థాయి దర్శకుడు, ఎలాంటి సినిమాలు తీశారు, ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నారు..? అనే విషయం ఇండస్ట్రీతోపాటు సినీ ప్రేక్షకులందరికీ తెలుసు. అయితే పొలిటికల్ సీజన్ ని క్యాష్ చేసుకోడానికి వర్మ 'వ్యూహం' అంటూ హంగామా మొదలు పెట్టారు. ఈ 'వ్యూహం'లో చిక్కుకుంది టీడీపీ కాదు, వైసీపీ అనే విషయం కాస్త ఆలస్యంగా తెలిసొస్తోంది. అసలింతకీ 'వ్యూహం' రిలీజైతే ఎవరైనా థియేటర్లకు వెళ్లి చూస్తారా..? పోనీ సదరు సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కోసం టైమ్ కేటాయించిన మంత్రులయినా థియేటర్లో ఆ సినిమా చూస్తారా..? సోషల్ మీడియాలో చిన్న చిన్న సీట్లు కట్ చేసుకుని సెటైర్లు పేల్చడానికి మాత్రమే ఆ సినిమా ఉపయోగపడుతోంది. అలాంటి సినిమాని భుజాన మోస్తూ వైసీపీ ఇప్పటికే వర్మకి ఎక్కువ సీన్ ఇచ్చింది. జనం కోరుకుంటున్న 'యాత్ర-2'లాంటి సినిమాల విషయంలో మాత్రం వైసీపీ ఎందుకో పెద్దగా ఆసక్తి చూపించకపోవడం విశేషం.

First Published:  8 Jan 2024 12:45 PM IST
Next Story